అరబ్ దేశాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి
ఇజ్రాయిల్ ప్రయోజనాలు తప్ప దానికి ఇంకేమీ పట్టవు
గల్ఫ్‌ను రక్షించడంలో యూఎస్ ఫెయిల్ : ఇరాన్ అధ్యక్షుడు
టెహ్రాన్ : పశ్చిమాసియా ప్రాంతం భద్రంగా ఉండాలంటే, అమెరికా ఇక్కడ ఉండకూడదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. అమెరికా వెళ్లిపోతేనే, పశ్చిమాసియాకు భద్రత లభిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు తాజాగా ఒక ట్వీట్ చేశారు. అమెరికా – ఇజ్రాయిల్, ఇరాన్ సైనిక ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో పెజెష్కియాన్ చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇరాన్‌పైనా అమెరికా, ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి.
అమెరికా భద్రతా వలయం నిండా చిల్లులే : అబ్బాస్ అరాగ్చి
పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా భద్రతా వలయం నిండా ఇప్పుడు చిల్లులే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యిద్ అబ్బాస్ అరాగ్చి వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలను రక్షించడంలో అమెరికా భద్రతా వలయం విఫలమైందని, దీంతో దాని నిండా చిల్లులే ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు. అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలు దాడులను తిప్పికొట్టడానికి బదులుగా, ఆహ్వానం పలికే దుస్థితికి చేరాయని ఎద్దేవా చేశారు.
ఈ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధిని తెరిచేలా ఇరాన్‌ను ఒప్పించాలంటూ చైనా లాంటి దేశాలనూ అమెరికా ప్రాధేయపడుతోందని అబ్బాస్ అరాగ్చి చెప్పారు. కవ్వింపులకు పాల్పడుతున్న విదేశీ దురాక్రమణదారుడిని (అమెరికా) ఇప్పటికైనా పశ్చిమాసియా దేశాలు వెళ్లగొట్టాలని ఆయన కోరారు. అమెరికాకు ఇజ్రాయిల్ ప్రయోజనాలు తప్ప, ఇంకేమీ పట్టవని మండిపడ్డారు. ఈ మేరకు అబ్బాస్ అరాగ్చి ఒక ట్వీట్ చేశారు.
యూఎన్ ఆఫీసు ఎదుట ఇరాన్ విద్యార్థుల నిరసన
అమెరికా – ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ, టెహ్రాన్ నగరంలో ఉన్న యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆఫీసు ఎదుట ఇరాన్ విద్యార్థులు నిరసనకు దిగారు. మినాబ్ ప్రాంతంపై అమెరికా – ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో చనిపోయిన పాఠశాల విద్యార్థినులను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఇలాంటి దాడుల ద్వారా అమెరికా, ఇజ్రాయిల్‌లు అంతర్జాతీయ చట్టాలకు తూట్లు పొడిచాయని విద్యార్థులు ఆరోపించారు.
అమెరికా వెళ్లిపోతేనే పశ్చిమాసియాకు భద్రత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



