Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌'కు భద్రత కట్టుదిట్టం

‘ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌’కు భద్రత కట్టుదిట్టం

- Advertisement -

– ప్రతి ఒక్కరి కదలికలపైనా నిఘా
– 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు
– 450 సీసీ కెమెరాలు, డ్రోన్ల వినియోగం
– మెస్సీకి జెడ్‌కేటగిరీ భద్రత, గ్రీన్‌ చానెల్‌ ద్వారా ప్రయాణం
– మ్యాచ్‌ లైవ్‌ టెలీకాస్ట్‌
– పాసులుంటేనే రండీ : సీపీ సుధీర్‌బాబు
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘మెస్సి గోట్‌ ఇండియా టూర్‌’ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌’కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. శనివారం రాత్రి 7గంటల నుంచి ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. 39వేల మంది సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న ఉప్పల్‌ స్టేడియానికి 13 ఎగ్జిట్‌ గేట్స్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు భద్రత కట్టుదిట్టం చేసినట్టు సీపీ తెలిపారు. శుక్రవారం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో భద్రత ఏర్పాట్లపై విలేకరుల సమావేశంలో డీసీపీలతో కలిసి సీపీ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్నారు. 3000 మంది పోలీస్‌లతో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. రెండు ఆక్టోపస్‌ టీమ్‌లతోపాటు లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, ఏఆర్‌, టీఎస్‌ఎస్‌పీలాంటి 18 ప్లాటూన్స్‌ను ఉపయోగిస్తున్నామన్నారు. డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌స్క్వాడ్‌, ఎస్‌బీ, సీసీఎస్‌, ఎస్‌వోటీతోపాటు వైద్యం, అగ్నిమాపక సిబ్బందిని సైతం రంగంలోకి దించామన్నారు. డ్రోన్ల ద్వార భద్రతను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తామన్నారు.

రాచకొండ కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంతోపాటు ఐసీసీసీ, ఉప్పల్‌ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్‌ నుంచి భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. ఈ మ్యాచ్‌కు టికెట్‌, పాసులున్న వాళ్లు మాత్రమే రావాలని, పాసులు లేనివారు స్టేడియం వద్దకు రావద్దని స్పష్టం చేశారు. 34 ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామని, వాహనదారులు పోలీసులు సూచించిన విధంగా పార్కింగ్‌ స్థలంలోనే పార్కింగ్‌ చేయాలని చెప్పారు. 13న మెస్సీ రాజమండ్రి నుంచి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారని, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఉప్పల్‌ స్టేడియానికి చేరుకుంటారని అన్నారు. ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించారని, స్టేడియం దగ్గర పాసులు అమ్మబోరని తెలిపారు. మెస్సీకి జెడ్‌ కేటగిరీ భద్రత ఉందన్నారు. గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని, మెస్సీని కలుసుకోవడం, ఫొటోలు తీయడం కుదరన్నారు. టికెట్లు, పాస్‌లు లేని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, మ్యాచ్‌ లైవ్‌ టెలీకాస్ట్‌ ఉంటుందని, ఇంట్లో కూర్చొని టీవీలో చూడాలని సీపీ సూచించారు. మ్యాచ్‌కు వచ్చేవారు 3 గంటల ముందే స్టేడియానికి చేరుకోవాలన్నారు. మ్యాచ్‌కు వచ్చేవారు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వినియోగిస్తే బాగుంటుందని, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తవన్నారు. స్టేడియంలో ప్రతి ఒక్కరి కదలికలపైనా నిఘా ఉంటుందన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ను రంగంలోకి దించుతున్నామన్నారు. అదనంగా విజిలెన్స్‌ విభాగాన్ని సైతం వినియోగిస్తున్నామని తెలిపారు. నిషేధిత వస్తువులను స్టేడియంలోకి తీసుకురావద్దన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -