ఇనుప గేటును ధ్వంసం చేస్తూ దూసుకెళ్లిన కారు
కారు సీజ్..నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. మాస్క్ ధరించిన ఓ వ్యక్తి వేగంగా కారు నడుపుతూ అసెంబ్లీ గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లాడు. అనంతరం స్పీకర్ విజయేందర్ గుప్తా కార్యాలయం బయట పుష్పగుచ్ఛం ఉంచి, కారుపై సిరా విసిరి..అదే కారులో పరారయ్యాడు. వాహనానికి ఉత్తర్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ ప్లేటు ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. వాహనం కోసం గాలింపు చర్యలు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ బృందంతో పాటు బాంబు స్క్వాడ్ అసెంబ్లీలో తనిఖీలు చేపట్టాయి. పుష్పగుచ్ఛంలో ఏమీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల వేళ ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవడం భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోంది. భద్రతా లోపంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి.
ఏం జరిగింది..?
అసెంబ్లీ గేట్ నెం. 2 నుంచి యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ గల టాటా సియెర్రా కారు గేట్ బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించింది. ఇది ప్రధాన గేటు కానందున సభాసమావేశాలు లేని సమయంలో ఇక్కడ భద్రత తక్కువగా ఉంటుందని సమాచారం. అలాగే దుండగుడు బయటకు వెళ్లే సమయంలో స్పీకర్ కారుపై ఇంక్ చల్లినట్టు అధికారులు తెలిపారు. వీఐపీ గేట్ వద్ద భద్రత కోసం సీఆర్పీఎఫ్‌ను మోహరించారు. బాంబు వంటి వస్తువు ఏదీ లభించలేదు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నిందితుడు పేరు సరబ్‌జిత్ సింగ్, ఇతను మా పోలీస్ స్టేషన్ పరిధిలోని పూరన్‌పూర్‌కు చెందిన నివాసిగా గుర్తించాం. ఇంకా దీనికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రస్తుతం సేకరించే పనిలో ఉన్నాం” అని పిలిభిత్ ఎస్పీ సుకీర్తి మాధవ్ తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



