విజయోత్సవాలను అనుమతించబోం : డీజీపీ శివధర్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో శుక్రవారం జరిగే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 12 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 138 కౌంటింగ్ కేంద్రాల వద్ద వ్యూహాత్మకంగా మూడంచెల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామనీ, లెక్కింపును సవ్యంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీలకు సంబంధించిన ఫలితాలు వెలువరిస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సాయుధ పోలీసు బలగాలతో సమస్యాత్మక ప్రాంతాల వద్ద గస్తీని కూడా నిర్వహిస్తున్నామని వివరించారు.
ముందస్తు చర్యగా గుండాలు, రౌడీలను అదుపులోకి తీసుకోవడంతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై వెబ్ కెమెరాలతో గట్టి నిఘా వేసి ఉంచామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద నిషేధ ఆంక్షలు విధించామని పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని పోలీసులు నియంత్రిస్తారని డీజీపీ తెలిపారు. ఫలితాలు వెల్లడైన తర్వాత గెలుపొందిన వారు విజయోత్సవాలు నిర్వహించడాన్ని కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు.
12వేల మంది పోలీసులతో భద్రత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



