సవరణలు చేయకుంటే రైతుల మెడకు ఉరే : రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
విత్తనాలతో నష్టపోయే రైతులకు పరిహారంపై క్లారిటీ లేదు
చట్టంలో అనేక లొసుగులు : సారంపల్లి మల్లారెడ్డి
రాష్ట్రాల హక్కులను హరించేలా ముసాయిదా చట్టం : విత్తన కార్పొరేషన్ చైర్మెన్ అన్వేశ్‌రెడ్డి
విత్తన చట్టం-2025 ముసాయిదా రైతు సంఘాల నేతల అభ్యంతరాలు
సమీక్ష సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను కేంద్రానికి పంపనున్న రైతు కమిషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న విత్తన చట్టం బహుళజాతి విత్తన కంపెనీల కోసమే అన్నట్టుగా ఉందని తెలంగాణ రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి విమర్శించారు. ఆ ముసాయిదా చట్టంలో సవరణలు చేయకుంటే రైతులకు మెడకు ఉరిగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. కేంద్రంలోని మోడీ సర్కారు విడుదల చేసిన విత్తన చట్టం-2025 ముసాయిదాపై రైతు కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది. అందులో రైతు సంఘాల నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు పాల్గొన్నారు. కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రం విడుదల చేసిన సీడ్ బిల్లులోని అంశాలను వివరించారు. సమావేశంలో పాల్గొన్న వారి నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలను సేకరించారు. వాటిని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రైతు కమిషన్ పంపనున్నది. సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తెస్తున్న విత్తన చట్టంలో విత్తనాల ధరలపై నియంత్రణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫ్ సర్టిఫికేషన్‌తోనే కంపెనీలు విత్తనాలు అమ్ముకునే అవకాశం ఇవ్వడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా ముసాయిదా చట్టం ఉందని ఎత్తిచూపారు. సీడ్ కార్పొరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ప్రయోజనం చేకూరేలా చట్టం లేదన్నారు. విత్తనాలతో రైతులు నష్టపోతే పరిహారం ఎవరిస్తారు? ఎవరి దగ్గరకు వెళ్లాలి? ఎన్ని రోజుల్లో పరిహారం అందిస్తారు? ఇలాంటి అంశాలేవీ చట్టంలో లేవని విమర్శించారు.
తెలంగాణ రైతు సంఘం (జవహర్‌నగర్) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ..కేంద్రం తెస్తున్న ప్రమాదకరమైన విత్తన చట్టంపై చాలా రాష్ట్రాల్లో చర్చ జరగకపోవడం ఆందోళనకరమన్నారు. విత్తనోత్పత్తికి తెలంగాణ కేంద్రమనీ, 20 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. కేంద్ర విత్తన చట్టం ద్వారా ఎక్కువగా నష్టపోయేది తెలంగాణ రైతులేనన్నారు. తెలంగాణ రైతు సంఘం(అమృత ఎస్టేట్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ..విత్తన చట్టం రైతుల సంక్షేమం దిశగా ఉండాలని కోరారు. 2012 చట్టం స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. విత్తనంపై కంపెనీల జవాబుదారీ తనం పెరగాలనీ, కంపెనీలను బాధ్యులుగా చేయాలని కోరారు. పరిహారం విషయంలో క్లారిటీ ఉండాలన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (జవహర్‌నగర్) టి.సాగర్ మాట్లాడుతూ..గద్వాల ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో 25 వేల మంది విత్తనాలను రైతులు పండిస్తున్నారని తెలిపారు. కంపెనీలు ఒప్పందాలు చేసుకుని కూడా రైతులను మోసం చేస్తున్నాయనీ, దిగుబడి తక్కువ వస్తే పరిహారం చెల్లించడం లేదని ఎత్తిచూపారు. విత్తన ధరలను, ఆయా రాష్ట్రాల్లో సాగుకు విత్తనాలు పనికొస్తాయా? లేదా? అని నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పుల్లోకి కూరుకుపోతున్న విత్తనోత్పత్తి రైతులకు మేలు చేయాలనే అంశం గురించి ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు.రైతు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను అరికట్టడంపై చట్టంలో క్లారిటీ లేదన్నారు. మరో సభ్యులు రాములు నాయక్ మాట్లాడుతూ..
కేంద్రం తీసుకురాబోతున్న చట్టం రైతులకు అన్యాయం చేసేలా ఉందన్నారు. రాష్ట్ర పరిధిలో విత్తన చట్టం తేవడానికి తమ ప్రజాప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. హార్టికల్చర్ వీసీ వీసీ రాజిరెడ్డి మాట్లాడుతూ..విత్తనాలతో నష్టపోయే రైతులకు పరిహారం ఇప్పించేందుకు ఫాస్ట్రాక్ కోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రెగ్యులటరీ సిస్టముంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి, భారతీయ కిసాన్ మోర్చా నాయకులు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ చట్టం చర్చల దశలోనే ఉందనీ, రాష్ట్ర ప్రభుత్వాల, రైతు సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సవరణలు చేసే అవకాశముందని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి, పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శోభన్‌నాయక్, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు కృష్ణారెడ్డి, ఎన్.వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు రామాంజేయులు, అరిబండి ప్రసాద్‌రావు, వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, రైతు సంఘం నాయకులు చందర్‌రావు, రైతు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
మల్టీనేషనల్ కంపెనీల కోసమే విత్తన చట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



