రైతులకు హక్కులు, సంక్షేమం నకిలీ విత్తనాల నియంత్రణ
విత్తనోత్పత్తి రైతులకు పరిహారం గ్యారంటీ
లోపాలను సవరించి పకడ్బందీ చట్టం : మంత్రి తుమ్మలకు వివరించిన విత్తన చట్టం ముసాయిదా కమిటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ విత్తన చట్టం-2025 ముసాయిదా కమిటీ సభ్యులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఆ చట్టంలో పొందుపరచబోయే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ‘తెలంగాణ విత్తన చట్టం-2025 ముసాయిదా కమిటీ సభ్యులతో మంత్రి చర్చించారు. ముసాయిదా చట్టంలోని విధి,విధానాలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని లోపాలను సవరించి పకడ్బందీ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. విత్తనాలు రైతుల ప్రాథమిక హక్కు అనీ, అందుకగుణంగా ఈ చట్టం రూపుదిద్దుకోబోతున్నదని పేర్కొన్నారు.
ముఖ్యంగా మార్కెట్‌లో అమ్ముతున్న నకిలీ విత్తనాలతో ప్రతియేట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనీ, ప్రస్తుత చట్టాల్లో వారికి నష్టపరిహారం ఇవ్వాలనే నిబంధన లేదని తెలిపారు. కొత్త చట్టంలో ఆ విషయాన్ని పొందుపరుస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరమనీ, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రావడం వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తన చట్టం- 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వులు -1983 అమలులో ఉన్న బలహీనతలను ఆసరా చేసుకుని కొన్ని వ్యాపార సంస్ధలు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు.
నాణ్యమైన విత్తనోత్పత్తి చేస్తూ… నాణ్యమైన విత్తనాలను అందిస్తున్న కంపెనీలను ప్రోత్సహిస్తూనే, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీలపై, ఏడాదికో కొత్త విత్తన రకాన్ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు దేశంలో మొట్ట మొదటిసారి పత్తి విత్తన చట్టం తీసుకువచ్చి రూ.1800గా ఉన్న బీటీి పత్తి ప్యాకెట్ ధరను రూ. 650కు తగ్గించామని గుర్తు చేశారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పత్తి ప్యాకెట్ల ధరపై నియంత్రణ మొదలైందని తెలిపారు. ఈ కొత్త చట్టాన్ని అవసరమైతే కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు అనుబంధంగా మాత్రమే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
విత్తన చట్టం-1966లోని కీలకాంశాలివే
ఈ చట్టం నోటిపై చేసిన వంగడాలకు మాత్రమే వర్తిస్తుంది.
విత్తనోత్పత్తిపై చట్టపరంగా ఎటువంటి నియంత్రణ లేదు.
విత్తన రకాలు, హైబ్రిడ్ విత్తనాల రిజిస్ట్రేషన్ తప్పని సరికాదు.
ధరల నియంత్రణ, ధరల స్థిరీకరణకు అధికారం లేకపోవడం.
రైతులకు నాణ్యత లేని విత్తనాల సరఫరా చేయబడటం.
పంట నష్టం వాటిల్లినప్పుడు ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారాన్ని త్వరితగతిన ఇప్పించలేకపోవడం.
విత్తన రైతులతో ఆయా కంపెనీలు చేసుకున్న ఒప్పందాలను కంపెనీలు ఉల్లఘించినట్లైతే, ఆ రైతులకు తగిన నష్టపరిహారం ఇప్పించే వీలు లేకపోవడం.
విత్తన ఉత్పత్తి, పంపిణీకి సంబంధిచిన అనుబంధ అంశాలపై నియంత్రణ అవకాశాలు లేవు.
పచ్చిరొట్ట విత్తనాలు చట్ట పరిధిలో లేకపోవడం.
చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు లేదా సంస్థలపై తీసుకొనే చర్యలు లేదా విధించే శిక్షలు కఠినతరంగా లేకపోవడం.
కొత్త విత్తన చట్టం-2025లోని కొన్ని ముఖ్యాంశాలివే
ప్రస్తుత ముసాయిదా తెలంగాణలో విత్తన ఉత్పత్తికి తగిన విధంగా చట్టాన్ని సిద్ధం చేయడం.
విత్తన రైతుల హక్కులు, సంక్షేమం కాపాడటం, రైతు, కంపెనీ ఒప్పందాల్లో న్యాయం, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా చట్టం.
పారదర్శకత, బాధ్యత, నియంత్రణ వంటి అంశాలను బలోపేతం చేయడం.
సాంప్రదాయ విత్తనాల పరిరక్షణ, నిల్వలకు ప్రోత్సాహం,
విత్తనోత్పత్తికి సంబంధించి సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు చేయడం.
విత్తన ఉత్పత్తి నియంత్రణ, పర్యవేక్షణ, వివాదాలకు పరిష్కారం.
విత్తన రైతులకు క్రెడిట్ ఇవ్వడం, విత్తనోత్పత్తిపై సాంకేతిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం.
సీడ్ కో ఆపరేటివ్‌లు, కమ్యూటి సీడ్ బ్యాంకులకు ఆర్థిక సాయం.
విత్తన ఉత్పత్తి నియంత్రణ కోసం రాష్ట్ర లైసెన్స్ ఉన్న సంస్థలకే అనుమతి, రైతు, ఆర్గనైజర్, కంపెనీ మధ్య త్రిపక్ష ఒప్పందం, కంపెనీలు విత్తన ప్రోగ్రాంను తప్పనిసరి సమర్పించాలి.
విత్తన రైతులకు సరఫరా కాలంలో 2/3 భాగం చెల్లింపులు చేయాలి. మిగతా 30 రోజుల్లో చెల్లించేలా చర్యలు, రిజిస్ట్రేషన్‌కు నిర్దిష్ట కాల పరిమితి విధించడం. అందులో మొత్తం 8 ఆద్యాయాలు, 32 సెక్షన్లు పొందుపర్చారు.
సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపీ, సీడ్ కార్పొరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, అడ్వకేట్ సునీల్ కుమార్, సీడ్ డైరెక్టర్ నగేష్ కుమార్, రామాంజినేయులు, శ్రీనివాస్ రెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నరసింహారెడ్డి, శివ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
విత్తనం రైతు ప్రాథమిక హక్కు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



