Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిసీతక్క ప్రేమ ఏ 4.0

సీతక్క ప్రేమ ఏ 4.0

- Advertisement -

”ఏమంటున్నాడు” ఎస్‌.ఐ అడిగాడు
”ఎంత కొట్టినా తాను చేయలేదంటున్నాడు సార్‌. ఇంకా కొడితే చచ్చిపోయేలా ఉన్నాడు సార్‌” హెడ్‌ కానిస్టేబుల్‌ చెప్పాడు
”సరే కొద్దిగా ఆపండి, టీనో..కాఫీనో ఇచ్చి చూడండి. తర్వాత మొదలుపెట్టండి. ఈరోజు నిజం కక్కాల్సిందే వాడు”
”నాకేమో వాడు ఈ నేరం చేయలేదనిపిస్తోంది సార్‌”
”మీ ట్రీట్మెంట్‌ మీరివ్వండి. అవసరమైతే డాక్టర్‌ చేత ట్రీట్మెంట్‌ ఇప్పించి మరీ కొట్టండి, నిజం రాబట్టండి”

ఒక గొర్రెలకాపరి కథ. చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకానొక ఊర్లో ఓ గొర్రెల కాపరి. పెద్ద కుటుంబం, తల్లి, తండ్రి, తాను, భార్య, గంపెడు పిల్లలు. చిన్న ఇల్లు. ఓ యాభై గొర్రెలు రోజూ తోలుకుపోయి సాయంకాలానికి వస్తుంటాడు. వాటిని తమ ఇంటిముందున్న కంచెలో ఉంచి జాగ్రత్తగా చూసుకునేవాడు.
ఇంతలో ఆ ఊరికి ఓ స్వామి వస్తాడు. ఆయన ఓ నెలరోజులుండి ఇంకో ఊరికి పోతాడు. మనుషుల సమస్యలేవైనా సరే సులువుగా పరిష్కారాలు చూపుతాడని ఆనోటా ఈనోటా విన్న మన గొర్రెల కాపరి స్వామిని దర్శించుకొని తమ ఇల్లు ఇరుకైపోయిందని, పెద్దది కట్టుకునే శక్తిలేదని, ఏదైనా మార్గం చూపాలని స్వామిని అడుగుతాడు.
”ఓ ముప్పై గొర్రెల్ని ఇంట్లో పెట్టుకో నాయనా. తరువాత వారానికి కనపడు” అని స్వామి ఉవాచ.
ఉన్న మనుషులకే స్థలం లేదు గొర్రెల్ని ఎలా లోపల పెట్టుకోవాలని అడగబోయి ఆ స్వామి పెద్ద గురువని తటపటాయించి ఏమీ అనలేక ఇంటికొస్తాడు. ముప్పై గొర్రెల్ని లోపల కట్టేస్తాడు. స్వామి మాట కాబట్టి ఎవరూ ఏమీ అనకుండా సర్దుకుంటారు. ఓ వారానికి స్వామిని దర్శిస్తాడు రెండోసారి. ఎలా ఉందని అడుగుతాడు. పరిస్థితి ఇంకా కష్టమయింది స్వామీ అంటాడు గొర్రెల కాపరి. అయితే ఇంకో ఇరవై గొర్రెల్ని లోపల కట్టమంటాడు. పుండుమీద కారం చల్లినట్లుందని ఏమీ అనకుండా ఇంటికి పోయి అదే చేస్తాడు. మళ్లీ వారానికి స్వామితో ఇంకా భయంకరంగా అయింది పరిస్థితి అని చెబుతాడు. ఓ ఇరవై గొర్రెల్ని బయటకు తీసేసి పడుకొండి అంటాడు. తర్వాత వారం పోయినప్పుడు తమ పరిస్థితి కొద్దిగా మెరుగయిందని చెబుతాడు. ఆనందమైన మొహంతో. ఐతే మిగిలిన ముప్పై గొర్రెల్ని కూడా బయటకు తీసేసి మరో వారానికి కనపడమంటాడు స్వామి. మనుషులు మాత్రమే మిగిలారు ఇంట్లో ఇప్పుడు. మరుసటివారం స్వామిని చూసి ఇంకా సంతోషకరమైన మొహంతో ఇప్పుడు చాలా బాగుంది స్వామి అని దక్షిణ చెల్లించుకొని, తమ సమస్య ఇలా స్వామివల్ల పరిష్కారమైనందుకు దండంపెట్టి ఇంటికి బయలుదేరతాడు హుషారుగా.

పైన పోలీసు స్టేషను సీను, కింద గొర్రెలకాపరి కథ చదివాక ఏమైనా గుర్తొచ్చిందా? వచ్చే ఉంటుంది. మన ఆర్ధిక మంత్రి సీతమ్మ జీఎస్టీ తగ్గించిన విషయం కూడా ఇలాగే ఉన్నట్టు తోస్తుంది. ఇంత అకస్మాత్తుగా ప్రజలమీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చినట్టు? జీఎస్టీ పన్ను స్లాబులను మార్చి కిందనున్నవారి కష్టాలను పోగొట్టే పని కూడా ప్రభుత్వాలు చూడాలి, పిరమిడ్‌లో కిందనున్నవారి కష్టాలు మా కష్టాలన్న డైలాగులు చెప్పి మరీ ప్రేమను వ్యక్తం చేయడం చూస్తే వీళ్లకు 4.0 మదిలో ఉందని సులభంగా అర్థమవుతుంది. ఇది ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేతితో లాక్కున్నట్టుగా ఉందని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు ఓ పక్క తమ కష్టాల్ని తెలియజేశారు. పేరు మాత్రం కేంద్రానికి, కష్టాలు మాత్రం రాష్ట్రాలకి. చివరికి ప్రజలకు నోటిదాకా వచ్చేది సున్నా అని ముందు ముందు గణాంకాలు చూపుతాయి.
సేవా పన్నులు బీమా ప్రీమియంపై తగ్గడం వెనుక బీమా ఉద్యోగుల సంఘం చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. ఆ విషయం ఎవరూ చెప్పరు కాని ప్రజలు, పాలసీదారులు చూస్తున్నారు. ఇక రాష్ట్రాలు ఎప్పటినుండో ఈ జీఎస్టీలో తమ వాటా కోసం పోరాడుతూనే ఉన్నాయి. పిల్లులు, కోతి కథ అందరికీ తెలుసు. కేంద్రం ఇప్పుడాపని చేస్తోందా అన్న అనుమానం రావడం సహజం. రాష్ట్రాల వాటాలు పంచడంలో కూడా తమవారికి పెద్ద పీట వేసి వాళ్ళు ఎక్కడ కూచున్నా అన్నీ వడ్డించే రకంగా ఉంది పరిస్థితి.
తల బాగుంటే శరీరమంతా బాగుంటుందని అంటున్నారుగాని శరీరమే లేని తలను ఎలా ఊహించుకుంటారు? శరీరముంటేనే తలకు విలువ, అలాగే తలకూను. కాళ్లు నడిపించుకుంటూ పోతే చేతులు పనిచేస్తేనే కదా నోటికి ఆహారం వచ్చేది. అలా కాకుండా కాళ్లను, చేతులను, మిగతా శరీరానికి పనిలేకుండా చచ్చుబడేలా చేస్తే తల ఒక్కటే ఉండజాలదు. ఈ సమాఖ్య వ్యవస్థలో కూడా అంతే, రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడె కేంద్రం ఉండేది. కేంద్రం పెద్దన్నయ్యలా వ్యవహరించాలి కాని హిట్లరై కూచోకూడదు.
ప్రజలెప్పుడూ దేశప్రజలే అని గమనించాలి. రాష్ట్రాల ప్రజలని, కేంద్ర ప్రజలనీ ఉండరు. ఇద్దరినీ పైన కూచోబెట్టేది వాళ్లే. గుండె శరీరం మొత్తానికి రక్తం సరఫరా చేసినట్లే కేంద్రమూ చేయాలి, అంతే తప్ప నాకు కావలసిన కాలెయానికి, మూత్రపిండాల్లో ఒక దానికి మాత్రం సరఫరా చేస్తాను, అనే విధంగా శరీర భాగాలను వేరువేరుగా చూస్తే అది గుండె అనిపించుకోదు, మెడపైనున్న తల కూడా తల అనిపించుకోజాలదు. తలపై ఉండే కిరీటం తలకు మాత్రమే కాదు, శరీరానికి మొత్తంగా చెందుతుంది. తల, కిరీటం మాత్రమే ఉంటే అది గోడకు తగిలించుకోవడానికి మాత్రమే పనికొస్తుందని తెలుసుకోవాలి.

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad