నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగర జర్నలిస్టులకు నగరంలో అందుబాటులో ఉన్న రెండు ప్రభుత్వ స్థలాలను ఇచ్చి తీరుతామని జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భరోసా ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కి వారు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని గంగా స్తాన్ లోని ప్రభుత్వ భూమి రూరల్ నియోజకవర్గంలో ఉన్నందున ఎమ్మెల్యే భూపతిరెడ్డి తో మాట్లాడి జర్నలిస్టులకు కేటాయిస్తామని సీతక్క,షబ్బీర్ అలీ మాటిచ్చారు. నగరంలో ప్రత్యామ్నాయంగా ఎక్కడా ప్రభుత్వ భూమి అందుబాటులో లేని కారణంగా గంగా స్థాన్ లోని ప్రభుత్వ భూమిని జర్నలిస్టులకు ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీతక్క, షబ్బీర్ అలీ కలెక్టర్ కు సూచించారు.
ఉర్దూ జర్నలిస్టుల కోసం అర్సపల్లి శివారులోని నిజాంసాగర్ డిఫంక్ట్ సబ్ కెనాల్ భూమిని కేటాయించాలని వారు కలెక్టర్ ను ఆదేశించారు.గతంలో ఈ డిఫంక్ట్ సబ్ కెనాల్ భూమిను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన విషయాన్ని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. మిగిలిన స్థలాన్ని ఉర్దూ జర్నలిస్టులకు ఇచ్చేందుకు వీలుగా ప్రక్రియ మొదలు పెట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు జమాల్పూర్ గణేష్, పాకాల నర్సింలు,పంచరెడ్డి శ్రీకాంత్,వాగ్మరే శుభాష్,ప్రమోద్ గౌడ్,కత్తుల రాజేష్, ఇంజమూరి మధు,మండే మోహన్,భూపతి, పప్పా ఖాన్,గౌస్ ,నాయీమ్ ఖమర్,ఆనంద్ పాల్,మాజిద్,అసద్,అఫ్జల్,ఖలీద్ తదితరులు సీతక్క,షబ్బీర్ ఆలీకి వినతి పత్రం అందజేశారు.