Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకమలం క్యాడర్‌లో సెగ

కమలం క్యాడర్‌లో సెగ

- Advertisement -

జంబో కమిటీపై ద్వితీయ శ్రేణి నేతల్లో గందరగోళం
ముఖ్య నాయకుల అనుచరులకే పెద్ద పీట
కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యమే కరువు
మేడ్చల్‌ మల్కాజిగిరి, గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాలకు అధిక ప్రాధాన్యం
పార్టీ కోసం కష్టపడే నాయకులకు నిరాశ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీలో అంతర్గత అసంతృప్తి కుంపటి రగులుకుంది. బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు ఏర్పాటు చేసుకున్న జంబో కమిటీతో కమలం క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలతో బీజేపీ బలోపేతమవుతుందా? లేక అంతర్గత విభేదాలు పెంచుతుందా? రాంచందర్‌రావు తీసుకున్న నిర్ణయం పార్టీకి జవసత్వాలను ఇస్తుందా? జనానికి దూరం చేస్తుందా? అన్న ప్రశ్నలు ఆ పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పని చేసే నాయకులకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పించలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్ర అంతర్గత అసంతృప్తిని పెంచుతున్నది. ఎక్కువ మంది నాయకులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గం…ఇప్పుడు ఆ పార్టీలో అసంతృప్తి సెగలు పుట్టిస్తున్నది.

ఇటీవల 198 మందితో జంబో రాష్ట్ర కార్యవర్గాన్ని అధ్యక్షులు రాంచందర్‌రావు నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో 116 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు, 62 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 20 మంది శాశ్వత ఆహ్వానితులతో కమిటీ ప్రకటించారు. కానీ అన్ని జిల్లాలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వలేదు. నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరిగిందా? అన్న ప్రశ్నకు సమాధానం వినిపించడం లేదు. అందులో సామాజిక న్యాయం భూతద్ధం పెట్టి వెతికి కనిపించడం లేదంటూ నేతల్లో నిరసన వ్యక్తమవుతుంది. కమిటి కూర్పులో మేడ్చల్‌ మల్కాజిగిరి ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలొస్తున్నాయి. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్‌కు బలం చేకూర్చడానికి దాదాపు 15 మందికి అవకాశం కల్పించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 38 మందికి చోటు కల్పించడం పట్ల ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్ర స్థాయి కమిటీని గ్రేటర్‌ కమిటీ స్థాయికి దిగజార్చారని ఆవేదన వ్యక్తమవుతోంది. జంబో కమిటీ కూర్పులో జిల్లాలకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర అధ్యక్షుడిపై గుర్రుగా ఉన్నారు. కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కమిటీ వేశారని జిల్లాల వారీగా అసంతృప్తి పెరుగుతోంది. కొన్ని జిల్లాలకు అవకాశం ఇచ్చి, మరికొన్ని జిల్లాలను పూర్తిగా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. ఆదిలాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ లాంటి జిల్లాలకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో చోటు లేకపోవడం పట్ల ఆ జిల్లాల నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పార్టీ బలంగా ఉన్న జిల్లాలకు మొండి చేయి చూపించి, పార్టీ లేనిచోట ఎవరి ప్రోద్బలంతో అవకాశం కల్పించారన్న ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. ఇది జంబో కమిటీ కాదు…జంబో అన్యాయమంటూ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ కమిటీలో పోస్టులు ఇచ్చినప్పటికీ రాంచందర్‌రావు చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమయ్యేలా ఆయన పక్కా ప్లాన్‌తో కమిటీని నియమించారనే విమర్శలొస్తున్నాయి. పార్టీ అన్ని వర్గాలను కలుపుకునే ప్రయత్నం చేశామంటూ చెబుతున్నప్పటికీ లోపల అసంతృప్తి మాత్రం బుసలు కొడుతోంది. పార్టీ బలోపేతం కన్నా పోస్టుల పంచాయితీగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -