అత్యధికంగా పశ్చిమబెంగాల్లో రూ.319 కోట్లు
క్యాష్, డ్రగ్స్, మద్యం, బంగారు ఆభరణాల సీజ్ :ఈసీ వెల్లడి
న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో రూ.650 కోట్లకుపైగా విలువైన నగదు, మాదకద్రవ్యాలు, మద్యం పట్టుబడినట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ఇందులో రూ.230 కోట్లు విలువైన డ్రగ్స్, రూ.231.01 కోట్లు విలువైన కానుకలు ఉన్నాయని చెప్పింది. రూ.79.3 కోట్లు విలువైన 29.63 లక్షల లీటర్ల మద్యం, రూ.53.2 కోట్ల నగదు, రూ.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశామని పేర్కొంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వీటన్నింటిని తరలిస్తుండగా పట్టుకున్నట్టు ఆదివారం ఈసీ వెల్లడించింది.
ఏ రాష్ట్రంలో ఎంతంటే?
పశ్చిమ బెంగాల్లో రూ.319 కోట్లు, తమిళనాడులో రూ.170 కోట్లు, అసోంలో రూ.97 కోట్లు, కేరళలో రూ.58 కోట్లు, పుదుచ్చేరిలో రూ.7 కోట్లు విలువైన నగదు, మద్యం, కానుకలు, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ చెప్పింది. కోల్కతాలోని టోలీగంజ్ ఏరియాలో ఒక ఎస్యూవీ వాహనం నుంచి రూ.38 లక్షల నగదును సీజ్ చేశారు. ఒక ప్లైవుడ్ దుకాణం సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో ఈ నగదు లభ్యమైంది. దీన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఆ డబ్బు కోల్కతాలోని అలీపుర్ ఏరియాకు చెందిన ఒక వ్యాపారవేత్తది అని గుర్తించారు. అసోంలో రూ.4 కోట్ల నగదు, రూ.20 కోట్ల మద్యం, రూ.56 కోట్ల డ్రగ్స్, రూ.4 కోట్ల బంగారం, వెండి ఆభరణాలు, రూ.13 కోట్ల ఇతర వస్తువులను సీజ్ చేశారు.
5,173కుపైగా ఫ్లయింగ్ స్క్వాడ్లు
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించేందుకు 5,173కుపైగా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఈసీ మోహరించింది. సున్నితమైన ప్రదేశాల్లో వాహనాల తనిఖీ, అనుమానాస్పద కార్యకలాపాల పర్యవేక్షణ కోసం 5,200 మందితో నిఘా టీమ్లను ఏర్పాటు చేసింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఈనెల 9న, తమిళనాడులో ఈనెల 23న ఓటింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో ఈనెల 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కఠిన ఆదేశాలు
నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్టు చేసింది. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలు, వాటి 12 సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులు (సీఈఓలు), పోలీస్ డైరెక్టర్ జనరల్స్ (డీజీపీలు), ఇతర ఉన్నతాధికారులతో ఈసీ పలు సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలు హింసారహితంగా, బెదిరింపులు లేకుండా, ప్రలోభాలు లేకుండా జరిగేలా చూడాలని అమలు సంస్థలకు ఈ సమావేశాలలో స్పష్టమైన సూచనలను జారీ చేసింది.



