– ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
– 2025 – 26 వార్షిక ప్రణాళిక కింద ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వార్షిక ప్రణాళిక 2025 – 26 కింద ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతి, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకాల కింద బ్యాంక్ అనుసంధానంతో ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. రవాణా రంగంలో ఈ వి టూ వీలర్, ఈ వి త్రి వీలర్ పథకాలు, వ్యవసాయ రంగంలో సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ వంటి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయేతర పథకాలకు జూలై 1, 2025 నాటికి 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాలు, శిక్షణ పథకాలకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించరాదు. ఒక రేషన్ కార్డుకు ఒకరే అర్హులుగా పరిగణిస్తారు. బ్యాంక్ సమ్మతి తప్పనిసరి.
అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), పట్టాదార్ పాస్‌బుక్ (సోలార్ పంప్ కోసం కనీసం రెండు ఎకరాలు), బోరువెల్ ఉనికి ధృవీకరణ, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తదితర పత్రాలు సమర్పించాలనీ ఆ ప్రకటనలో తెలిపారు. గిగ్ కార్మికులు అయిన జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ వ్యవస్థాపకులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైనా పథకం పొందిన వారు లేదా దళిత బంధు పథకం లబ్ధిదారులు ఈ పథకాలకు అనర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 17 నుంచి 24 వరకు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొని, అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం (మొదటి అంతస్తు, గది నం.113)లో సమర్పించాలని ఆయన ప్రకటనలో సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



