Tuesday, October 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంస్వావలంబనే లక్ష్యం !

స్వావలంబనే లక్ష్యం !

- Advertisement -

– ముప్పులు, సవాళ్ళను ఎదుర్కొంటూనే అవకాశాలను అందిపుచ్చుకోవాలి
– పిలుపునిచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ దిశా నిర్దేశ పత్రం

– 2035కల్లా సోషలిస్టు ఆధునీకరణను సాధించడానికిక ఈ పంచవర్ణ ప్రణాళికా కాలం (2026-2030) చాలా కీలకమైనదిగా ఈ పత్రం నిర్వచించింది. అలాగే ముప్పులు, సవాళ్ళతో కూడిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి వుంటుందని పేర్కొంది. 2035కల్లా మధ్య స్థాయి అభివృద్ది చెందిన దేశాలతో పోల్చదగ్గ తలసరి జిడిపి వుండాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. గణనీయంగా పటిష్టమైన జాతీయ శక్తి సామర్ధ్యాలు, ప్రభావాన్ని కనబరచాలన్నది లక్ష్యంగా వుంది. మౌలికంగా సోషలిస్టు ఆధునీకరణ క్రమాన్ని సాకారం చేయాలని భావిస్తోంది.

బీజింగ్‌ : 15వ పంచవర్ష ప్రణాళికా కాలాని (2026- 2030) కి చైనా విధాన పరమైన దిశా నిర్దేశాన్ని పేర్కొంటున్న ప్రధాన రాజకీయ పత్రాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ విడుదల చేసింది. ఈ నెల 23న సమావేశమైన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20వ కేంద్ర కమిటీ నాల్గవ ప్లీనరీ సమావేశాల్లో ఈ పత్రాన్ని విడుదల చేశారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కేంద్ర నాయకత్వాన్ని, నూతన శకం ఆవిర్భావానికి చైనా లక్షణాలతో కూడిన సోషలిజంపై జిన్‌పింగ్‌ ఆలోచనా సరళిని ఈ విధాన పత్రం పునరుద్ఘాటించింది. పార్టీ మార్గనిర్దేశక సైద్ధాం తిక పత్రంగా దీన్ని పేర్కొంది.
పార్టీ రాజకీయ బ్యూరో పనితీరును ఈ ప్లీనరీ సమా వేశాలు సమీక్షిం చాయి. అనంతరం పంచవర్ష ప్రణాళికా కాలానికి సిఫారసులను ఆమోదిం చాయి. ఈ సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కీలకోపన్యాసం చేశారు. ముసాయిదా సిఫారసులపై వివరణ ఇచ్చారు. జిన్‌పింగ్‌ కీలక నాయకత్వాన్ని, పార్టీ కేంద్ర కమిటీ సమైక్య నాయకత్వాన్ని, ప్లీనరీ నొక్కి చెప్పింది.
ఈ పత్రంలోని కీలకాంశాలను పరిశీలిస్తే… అత్యున్నత నాణ్యత గల అభివృద్ధిని సాధించడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో స్వావలంబన సాధించడం, లోతైన సంస్కరణలు, ఆధునీకరణ ప్రక్రియను అమలు చేయడం, సాంస్కృతిక, నైతిక పురోగతి, మరింత మెరుగైన ప్రమాణాలు, ఉమ్మడి సంక్షేమం, ‘సుందరీకరణ చైనా చొరవ’ పేరిట పర్యావరణ ప్రగతి, మరింత బలోపేతమైన జాతీయ భద్రతను సాధించడం ప్రధాన లక్ష్యాలుగా వున్నాయి.

ఇక ఆర్థిక, వ్యవస్థాగత ప్రాధాన్యతలకు వస్తే…. తయారీ రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తయారుచేయాలని చైనా నాయకత్వం ధృఢంగా కోరు కుంటోంది. సమగ్ర, హరితాభివృద్ధిని పెంపొందిం చాలని చూస్తోంది. వినూత్న ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి, నూతన నాణ్యత కలిగిన ఉత్పాదక శక్తులపై దృష్టి పెట్టాలని ఆ రకంగా సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించాలని విధాన పత్రం నిర్దేశిస్తోంది. ఇకపోతే దేశీయంగా డిమాండ్‌ విషయానికి వస్తే వినిమయాన్ని విస్తరించాలని, పెట్టుబడుల సామర్ధ్యాన్ని మెరుగుపరచాలని, సమైక్య జాతీయ మార్కెట్‌ను బలోపేతం చేయాలన్నది లక్ష్యంగా వుంది. మార్కెట్‌ సంస్కరణలను చూసి నట్లైతే, అత్యున్నత ప్రమాణాలతో కూడిన సోషలిస్టు మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంస్థలను పరిపుష్టం చేయాలని భావిస్తోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సహకరాన్ని పెంపొందించాలని, బహుళవాదాన్ని పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మొత్తంగా చూసినట్లైతే, తదుపరి ఆధునీకరణ దశలోకి చైనా ప్రవేశించినందున..పటిష్టమైన కేంద్ర నాయకత్వం కింద విధానాలను కొనసాగిస్తూ, భద్రత, స్వావలంబన, సుస్థిరతలపై దృష్టి పెట్టాలని నాల్గవ ప్లీనరీ సమావేశాలు స్పష్టం చేశాయి. రాజకీయ క్రమశిక్షణతో, జాతీయ భద్రతా పరమైన చర్యలతో ఆర్థిక పరివర్తనను సమతూకం చేసుకుంటూ ముందుకు సాగడం చైనా కమ్యూనిస్టు పార్టీ కీలకమైన కర్తవ్యంగా వుంది. అదే సమయంలో జిన్‌పింగ్‌ నాయకత్వం ఎలాంటి సవాళ్లు ఎదురవకుండా చూసుకోవాల్సి వుంది.

అదే సమయంలో చైనా పలు సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. మందగిస్తున్న ఆర్థిక వృద్ధి, సాంకేతిపరమైన లోపాలు, పెరుగుతున్న జనాభా వృద్ధి, వాటివల్ల ఎదురవుతున్న సవాళ్లు, పర్యావరణ, ఇంధపరమైన మార్పిడి ప్రక్రియ, పాలనాపరమైన చిక్కుముడులు, అవినీతి వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి చేపట్టాల్సిన చర్యలను, అలాగే మరోవైపు కచ్చితమైన, కఠినమైన పార్టీ క్రమశిక్షణను కొనసాగించాల్సి వుందని విధాన పత్రం పేర్కొంది
.

– ఇక చైనా ఎదుర్కొంటున్న ముప్పుల గురించి పరిశీలిస్తే..అమెరికాతో శతృత్వం, సాంకేతిక నియంత్రణలు, అంతర్జాతీయంగా సప్లై చెయిన్స్‌ (సరఫరా గొలుసులు) ఒత్తిళ్ళు వంటివి వున్నాయి. దేశ భద్రతను పరిరక్షించుకోవడం, సుస్థిరమైన అంతర్జాతీయ వాతావరణాన్ని కొనసాగించడంలో సవాళ్ళు వున్నాయి. మరోవైపు అంతర్గతంగా రుణ సంక్షోభాలు, యువత నిరుద్యోగం, సామాజిక అసమానతలు, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి వంటివి వున్నాయి. దీనికి తోడు సైద్ధాంతికపరమైన ముప్పులూ పొంచి వున్నాయి. సైద్ధాంతికపరమైన చొరబాట్లను నివారించాల్సిన అవసరం కనిపిస్తోంది. మీడియా, సంస్కృతి, సైబర్‌ విభాగాలపై నియంత్రణను పాటించాల్సి వుంది. మరోవైపు తైవాన్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నాలు కొనసాగించాల్సి వుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -