త్వరలో ముగియనున్న షట్‌డౌన్
అనుకూలంగా ఓటేసిన ఎనిమిది మంది డెమొక్రాట్లు
ఆరోగ్య సబ్సిడీల కొనసాగింపుపై ప్రభుత్వం హామీ ఇవ్వకపోయినా సమర్ధన
దీనిపై వచ్చే నెలలో ఓటింగ్
డెమొక్రాట్ల శిబిరంలో దుమారం
వాషింగ్టన్ : అమెరికాలో 40 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌కు శుభం కార్డు పడబోతోంది. ప్రభుత్వ వ్యయ బిల్లుకు ఎట్టకేలకు సెనెట్ ఆమోదం లభించింది. బిల్లును 60 మంది సమర్ధించగా 40 మంది వ్యతిరేకించారు. ఇప్పుడది ప్రతినిధుల సభ ముందుకు వెళుతుంది. ఆ తర్వాత సంతకం కోసం దానిని దేశాధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ వద్దకు పంపుతారు. ఆయన సంతకం చేయగానే షట్‌డౌన్ ముగుస్తుంది. అయితే ఈ ప్రక్రియకు అనేక రోజుల సమయం పడుతుంది. ట్రంప్, రిపబ్లికన్లు ప్రతిపాదించిన ఒప్పందానికి ఎనిమిది మంది డెమొక్రాట్లు మద్దతు తెలిపారు. దీంతో సెనెట్‌లో వ్యయ బిల్లు ఆమోదం పొందింది.
ఏం జరుగుతుంది?
వ్యయ బిల్లును సెనెట్ ఆమోదించడంతో ప్రభుత్వం కొన్ని నిధులు మంజూరు చేయగలు గుతుంది. ఆహార సాయం, వృద్ధుల కార్య క్రమాలు, ఆరోగ్య రక్షణ వంటి పద్దులకు వచ్చే ఏడాది జనవరి 30వ తేదీ వరకూ నిధులు సమకూ రుతాయి. డెమొక్రాట్ల డిమాండ్ మేరకు ఆరోగ్య రక్షణకు సబ్సిడీల కొనసాగింపు విషయంపై డిసెంబ రులో ఓటింగ్ జరుగుతుంది. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు… .షట్‌డౌన్ కాలంలో తొలగిం చిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకుంటారు. నోటీసు లు అందుకున్న వారు కూడా ఉద్యోగాలలో చేరతారు. షట్‌డౌన్ సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలకు తమ సొంత నిధులు ఖర్చు చేసిన రాష్ట్రాలకు వాటిని రీయంబ ర్స్‌మెంట్ చేస్తారు. ప్రభుత్వానికి నిధులు అందించే ద్వైపాక్షిక బిల్లులను ఒప్పందంలో చేర్చారు.
ఆరోగ్య సబ్సిడీల పొడిగింపుపై వచ్చే నెలలో ఓటింగ్
సెనెట్‌లో రిపబ్లికన్లకే మెజారిటీ ఉంది. రిపబ్లికన్లు 53 మంది ఉండగా డెమొక్రాట్ల సంఖ్య 47 మాత్రమే. అయితే వ్యయ బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 60 ఓట్లు అవసరమవుతాయి. అంటే కనీసం మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును సమర్ధించేందుకు ఎనిమిది మంది డెమొక్రాట్లు అంగీకరించారు. అయితే బిల్లుకు తాను మద్దతు ఇవ్వబోనని సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ స్కమర్ స్పష్టం చేశారు. కొందరు డెమొక్రాట్లతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అఫోర్డబుల్ కేర్ చట్టం (ఆరోగ్య సంరక్షణ) కింద సబ్సిడీలను పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లుపై డిసెంబరులో ఓటింగ్ జరుగుతుంది.
డెమొక్రాట్ల శిబిరంలో అలజడి
వ్యయ బిల్లుపై సుమారు రెండు గంటల పాటు సెనెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. టెక్సాస్ సెనెటర్ జాన్ కార్నిన్ వ్యయ బిల్లుకు అనుకూలంగా చిట్ట చివరి ఓటు వేశారు. మితవాద డెమొక్రాట్లు బిల్లుకు అనుకూలంగా ఓటేయడంతో అది గట్టెక్కింది. ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలను కొనసాగిం చేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వకపోయినప్పటికీ బిల్లుకు కొందరు డెమొక్రాట్లు మద్దతు తెలపడం గమనార్హం. దీనిపై డెమొక్రాట్ల శిబిరంలో అలజడి రేగింది. ట్రంప్ ప్రభుత్వంపై డెమొక్రాట్లు పోరాటం కొనసాగించాలని అమెరికన్లు కోరుకుంటున్నారని పలువురు డెమొక్రాట్లు గుర్తు చేశారు. న్యూ హ్యాంప ్‌షైర్, నెవాడాలకు చెందిన ఇద్దరేసి డెమొ క్రాట్ సెనెటర్లతో పాటు వర్జీనియా, ఇల్లినా యిస్, పెన్సిల్వే నియా సెనెటర్లు కూడా బిల్లుకు అనుకూ లంగా ఓటేశారు. డెమొక్రాట్ల శిబిరంలో ఉన్న ఒక స్వతంత్ర సెనెటర్ సైతం బిల్లును సమర్ధించారు. దీంతో బిల్లు ఆమో దానికి అవసరమైన అదనపు ఓట్లు లభించాయి.
భారీగా విమాన సర్వీసుల రద్దు
ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం ఎంత దారుణంగా ఉన్నదంటే ఆదివారం రెండు వేలకు పైగా విమాన సర్వీసులను అమెరికా ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. షట్‌డౌన్ మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం ఇదే మొదటిసారి. అదే విధంగా ఏడు వేలకు పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.



