నియోజకవర్గ వ్యాప్తంగా అనుముకున్న విషాదఛాయలు..
నవతెలంగాణ – మణుగూరు
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు బొల్లోజు అయోధ్య చారి బుధవారం సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో ప్రమాదానికి గురై మృతి చెందారు. అయోధ్య చారి మరణ వార్త నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపించింది ప్రజలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. విషాద ఛాయలు అలుముకున్నాయి. మణుగూరు పట్టణంలో సంతాప సూచికంగా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణం లో బంద్ నిర్వహించారు .అయోధ్య చారి రామనుజవరం గ్రామానికి చెందినవాడు వీర తెలంగాణ విప్లవ పోరాట గడ్డ నల్లగొండ జిల్లా నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ఆ నాటి కాలంలో ఈ ప్రాంతంలో భూస్వాములకు ,పెత్తందారులకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు.
భూ పోరాటాలు నిర్వహించి భూస్వాముల భూములు ప్రజలకు పంచారు 18 సంవత్సరం నుండి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడుగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తూ అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ గా రాణిస్తూనే కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలలో చురుకైన పాత్ర నిర్వహించారు. తమ రాజకీయ గురువు అయిన పాకాల పాటి వెంకటేశ్వరరావు ( పెద్దబ్బాయి) అనుచరుడుగా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోశాడు చదువు లేకపోయినా గ్రామస్థాయి నుండి మండల కార్యదర్శి నియోజకవర్గ కార్యదర్శి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా పనిచేస్తున్నారు అంకుటత దీక్షతో అంచలంచలుగా ఎదిగారు. మణుగూరు జడ్పిటిసి గా గెలుపొంది ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు. ఈ ప్రాంతంలో ప్రతి పల్లె ప్రతి గ్రామం లో అయోధ్య అభిమానులు ఉన్నారు. ఆయన మరణ వార్త ఈ ప్రాంత ప్రజలలో తీవ్ర విషాదాన్ని నింపింది అయోధ్య చారి లేని లోటు ఎవరు తీర్చలేరని రాజకీయ నాయకులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు పలువురు కొనియాడారు.