– పార్టీ, ట్రేడ్ యూనియన్ల బలోపేతంలో కీలక కృషి
– ఎంబీ భవన్‌లో పార్థివ దేహంపై అరుణపతాకం కప్పిన జాన్‌వెస్లీ
– నివాళులర్పించిన ఎస్.వీరయ్య, జ్యోతి తదితర నేతలు
– ఎల్.వి.ప్రసాద్ ఆస్పత్రికి నేత్రదానం
– వైద్యపరిశోధనల నిమిత్తం బీబీ నగర్ ఎయిమ్స్‌కు భౌతికకాయం అప్పగింత
– సంతాపం ప్రకటించిన పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదాబాద్
సీపీఐ(ఎం) సీనియర్ నేత, హైదరాబాద్ నగర మాజీ కార్యదర్శి జి.రఘుపాల్(83) ఆదివారం కన్నుమూశారు. ఆయన నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కొన్నిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఉదయం 10:15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయన కండ్లను ఎల్.వి.ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. ఆయన కోరిక మేరకు వైద్యపరిశోధనల నిమిత్తం బీబీ.నగర్ ఎయిమ్స్ మెడికల్ కళాశాలకు భౌతికకాయాన్ని అప్ప గించారు. అంతకుముందు సీపీఐ(ఎం), ఐప్సో, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, బంధువుల సందర్శనార్థం హైదరాబాద్ లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయమైన ఎంబీ భవన్‌లో ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు ఉంచారు. అక్కడ ఎస్వీకే ట్రస్టు కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. రఘుపాల్ మృత దేహంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అరుణపతాకాన్ని కప్పారు. పూలదండ వేశారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, జ్యోతి, సీనియర్ నేతలు సారంపల్లి మల్లారెడ్డి, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు, బండారు రవికుమార్, సాగర్, అబ్బాస్, జహంగీర్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డీజీ.నరసింహారావు, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఐప్సో) జాతీయ అధ్యక్షులు, ఆప్ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌వీ.రమ, భూపాల్, జె.వెంకటేశ్, ఆనందాచారి, బాబూరావు, ఎం.వెంకటేశ్, ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి సోమయ్య, సీపీఐ(ఎం) నగర నాయకులు ఎం.శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జనగామ జిల్లా కార్యదర్శి ఎం.కనకారెడ్డి, ఐప్సో జాతీయ ఉపాధ్యక్షులు జి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేవీఎల్, నాయకులు పీఎస్‌ఎన్.మూర్తి, బొమ్మగాని ప్రభాకర్, జేకే.శ్రీనివాస్, రామరాజు, డాక్టర్ సమత, వినోద్‌కుమార్, సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్, సౌత్, మేడ్చల్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ జిల్లా నాయకులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ‘రఘుపాల్ అమరహే…అమరహే… సాధిస్తాం..సాధిస్తాం…మీ ఆశయాలు సాధిస్తాం..’ అంటూ పార్టీ శ్రేణులు అంతిమ వీడ్కోలు పలికాయి.
బలమైన పోరాటాలు నిర్మించడమే ఆయనకిచ్చే నివాళి
ఈ సందర్భంగా జాన్‌వెస్లీ, వీరయ్య, జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, తదితరులు మాట్లాడుతూ…సీపీఐ(ఎం) పార్టీ విస్తరణలో, నాయకత్వ తయారీలో రఘుపాల్ చేసిన కృషిని గుర్తుచేశారు. ఆయన మహా గ్రంధం లాంటివారని కొనియాడారు. వయస్సు మీద పడ్డా అతను ఎప్పుడూ చురుగ్గా ఉంటూ పార్టీ కోసం పనిచేసేవారని మననం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రేడ్ యూనియన్ విస్తరణకు ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో ఉండేలా కుటుంబ సభ్యుల్ని కూడా తీర్చిదిద్దడాన్ని ప్రశంసించారు. ఆయనకు భార్య భారతి ఎప్పుడూ సహకరించేవారనీ, ఇంటికొచ్చే పార్టీ సభ్యులను అప్యాయంగా చూసుకునేవారని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ సీపీఐ(ఎం) అభ్యర్థుల తరఫున నిర్విరామంగా పనిచేశారని తెలిపారు. సిద్ధాంతం పట్ల నిబద్ధతగల రఘుపాల్‌ను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని చెప్పారు. దోపిడీలేని సమసమాజం కోసం బలమైన పోరాటాలను రూపొందించడమే ఆయనకు ఇచ్చే నివాళి అన్నారు. పార్టీ యువ నాయకత్వం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రఘుపాల్ మృతి తీరని లోటు : ఆర్.అరుణ్‌కుమార్
సీనియర్ నాయకులు రఘుపాల్ మృతి పార్టీకి తీరని లోటు అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రఘుపాల్ నేపథ్యం ఇలా…
రఘుపాల్ 22 మే 1942లో జన్మించారు. ఆయనకు భార్య భారతి, కుమారుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి, కోడలు డాక్టర్ విజయలక్ష్మి, కూతురు ఉన్నారు. సీపీఐ(ఎం) నగర మాజీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆయన అల్లుడు. రఘుపాల్ తండ్రి జి.గోపాల్‌రెడ్డి 1957లో పీడీఎఫ్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి అజ్ఞాతజీవితం గడిపే సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య లీలమ్మ ఆదర్శ దంపతుల చేతుల్లో అతని బాల్యం గడిచింది. ఉన్నత విద్యను అభ్యసించారు. పశువైద్యులుగా ఉద్యోగం వచ్చినా పార్టీలో పనిచేసేందుకే మొగ్గుచూపారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిక సమయంలో తండ్రి సీపీఐ పక్షాన ఉంటే రఘుపాల్ సీపీఐ(ఎం) వైపు వచ్చారు. 1985 నుంచి 15 ఏండ్ల పాటు సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కార్యదర్శిగా పనిచేశారు. భాస్కర్‌రావు, డీజీ నర్సింహారావు, ఎమ్.ఎన్.రెడ్డి, లక్ష్మీదాస్, కృపేందర్, వెంకటేశ్, తదితరులతో కలిసి పార్టీ విస్తరణకు కృషి చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా సేవలందించారు. హైదరాబాద్‌లో కార్మికోద్యమ నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ప్రభుత్వ రంగంలో ట్రేడ్‌యూనియన్ విస్తరణకు కృషి చేశారు. ప్రతీ పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలల తరబడి జనగామను కేంద్రంగా చేసుకొని అన్ని గ్రామాలు తిరుగుతూ సీపీఐ(ఎం) అభ్యర్థుల గెలుపు కోసం విరామమెరగకుండా శ్రమించేవారు. రఘుపాల్ జీవితం కమ్యూనిస్టు ఉద్యమకారులకు ఆదర్శనీయం. 15 ఏండ్లుగా అఖిలభారత శాంతి సంఘీభావ సంఘంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఆ సంఘంలో జాతీయ సలహా మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. గతంలో ఆ సంఘానికి ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా సేవలందించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం అభివృద్ధిలోనూ తన వంతు పాత్ర పోషించారు. 2000 సంవత్సరంలో వచ్చిన వరదలతో ఎస్వీకే లైబ్రరీ పూర్తిగా నిండిపోయి పుస్తకాలు ఆగమయ్యాయి. ఎస్వీకే లైబ్రరీని పునరుద్ధరించడంలో తనవంతు సహకారం అందించారు. సాయుధపోరాటంలో పాల్గొన్న వారిపై అధ్యయనం చేసి పుస్తకాలు రాయించడంలో సహకరించారు.
రఘుపాల్ మరణం పట్ల జూలకంటి, వినయకుమార్ సంతాపం
సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర మాజీ కార్యదర్శి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ సభ్యులు జి రఘుపాల్ మరణం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినయకుమార్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ప్రజల కోసం తమ జీవితాలను అర్పించిన మలితరం నాయకుల్లో ఆయన ఒకరని వారు తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రఘుపాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నవతెలంగాణ సంతాపం
రఘుపాల్ మృతి పట్ల నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ ఆర్ సుధాభాస్కర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కొంతకాలం ప్రజాశక్తి పత్రికలో పనిచేశారనీ, అంతర్జాతీయ వార్తలతో పాటు పలు అంశాలపై వ్యాసాలు రాసేవారని గుర్తు చేశారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. రఘుపాల్ మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.
సీపీఐ(ఎం) సీనియర్ నేత రఘుపాల్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES