నవతెలంగాణ-అక్కన్నపేట: అక్కన్నపేట మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేధింపులు తాళలేక అటెండర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కవిత ఆమెను నిత్యం టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తుందని అటెండర్ సరిత తెలియజేశారు.
అంతేకాకుండా నువ్వు అటెండరు, నీ పొజిషన్ లో నువ్వు ఉండాలి ఎక్కువ మాట్లాడతావా, అంటూ కించపరుస్తూ మాట్లాడేదని అన్నది. ఇదే కాకుండా రూ:4వేలు ఇస్తేనే జీతం బిల్లులు చేస్తానని హుకుం జారీ చేశారని తెలిపారు. ఈ విషయంపై తహశీల్దార్ కు చెబితే ఆయన ఇద్దరికీ సర్ది చెప్పారని తెలిపారు. అయినా కవిత వేధింపులు ఆపలేదని, చివరికి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగానని అన్నది. ప్రస్తుతం అటెండర్ సరిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.