Tuesday, March 31, 2026
E-PAPER
Homeఆటలు31మందితో సీనియర్‌ మహిళల హాకీ శిక్షణా శిబిరం

31మందితో సీనియర్‌ మహిళల హాకీ శిక్షణా శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌:
31మంది సీనియర్‌ మహిళా హాకీ క్రీడాకారిణులకు హాకీ ఇండియా(హెచ్‌ఐ) శిక్షణా శిబిరం నిర్వహించనుంది. ఏప్రిల్‌ 1 నుంచి 9వరకు జరిగే ఈ శిక్షణా శిబిరంలో అత్యుత్తమ ప్రదర్శించిన ప్లేయర్లను ఈ ఏడాది జరిగే మెగా ఈవెంట్‌లకు ఎంపిక చేయనుంది. హైదరాబాద్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో రజత పతకంతో మెరిసి హాకీ ప్రపంచకప్‌కు భారతజట్టు అర్హత సాధించింది. దీంతో ఈ శిక్షణా శిబిరం ద్వారా మహిళల హాకీ ప్రపంచకప్‌కు ఆడే తుది జట్టును ఎంపిక చేయనున్నారు. కొత్త కోచ్‌ స్టోర్జ్‌ మారిజ్నే నేతృత్వంలోనే మహిళల జట్టు ఈ శిక్షణా శిబిరం ద్వారా ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు కసరత్తు చేయనుంది. రాబోయే రోజుల్లో భారత మహిళల హాకీ జట్టు బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. జూన్‌లో ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ నేషన్‌ కప్‌, ఆగస్టులో ప్రపంచకప్‌, ఆ తర్వాత సెప్టెంబర్‌ 19నుంచి అక్టోబర్‌ 4వరకు ఆసియా క్రీడల్లో భారత జట్టు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. గోల్‌కీపర్ల కోటాలో సవిత, మాధుర కిండో, బన్సరి సోలంకితోపాటు ఇటీవల గోల్‌కీపర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన బిచ్ఛు దేవి ఖరిబమ్‌ కూడా రేసులో ఉన్నారు. తీరిక లేని షెడ్యూల్‌తో గడపనున్న క్రమంలో ఈ శిక్షణా శిబిరం ప్లేయర్లను మానసికంగా సన్నద్ధం చేసేందుకు దోహదపడుతుందని కోచ్‌ మారిజ్నే తెలిపారు.

శిక్షణా శిబిరానికి ఎంపికైన ప్లేయర్లు…
గోల్‌కీపర్లు: సవిత, మాధురి కిండో, బిచ్ఛుదేవి ఖరిబన్‌, బన్సారి సోలంకి
డిఫెండర్లు: నిక్కి ప్రదాన్‌, ఇషికా చౌదరి, జ్యోతి సింగ్‌, లాల్‌తుంగ్లింగి, జ్యోతి, ఉదిత, షిల్పి దబాస్‌
మిడ్‌ఫీల్డర్లు: సుశీలా ఛాను, మనీషా చౌహాన్‌, వైష్ణవి, సాక్షీ రాణా, సునెలిటా టొప్పో, నేహా, ఇషికా.
ఫార్వర్డ్స్‌: దీపిక సోరెంగ్‌, రుతుజ దదాసో, బల్జీత్‌ కౌర్‌, నవ్‌నీత్‌ కౌర్‌, దీపిక, అన్ను, బ్యూటీ, హినా బానో, సోనమ్‌, లాల్‌రిమిసిమి, ముంతాజ్‌, సంగీతా కుమారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -