-సర్పంచుల ఫోరం అధ్యక్షులమంటూ ‘నేనంటే నేనే’ పోటీ
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ మండల రాజకీయాల్లో తాజా పరిణామం సర్పంచుల మధ్య తీవ్ర విభేదాలను బయటపెట్టింది. మండలంలోని 32 గ్రామాలకు చెందిన సర్పంచులు ప్రస్తుతం రెండు వర్గాలుగా చీలిపోయి, సర్పంచుల ఫోరం అధ్యక్షులమంటూ ఇద్దరు వ్యక్తులు తమ తమ వర్గాల తరఫున ప్రకటించుకోవడం కలకలం రేపుతోంది. ఎవరికి వారే తమ వర్గమే అసలైన సర్పంచుల ఫోరమని పేర్కొంటూ,ఫోరం అధ్యక్షులుగా తామే ఎన్నుకోబడ్డామని తెలిపే పత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి ప్రస్తుతం విస్తృతంగా చెక్కర్లు కొడుతున్నాయి.ఒకే మండలంలో రెండు వేర్వేరు ఫోరాలు అన్నట్లుగా పరిస్థితి నెలకొనడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఈ పరిణామంతో సర్పంచుల ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామస్థాయి సమస్యల పరిష్కారం కోసం ఏకతాటిపై ఉండాల్సిన సర్పంచులు వర్గాలుగా విడిపోవడం వల్ల పాలనా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో ఈ విభేదాల వెనుక రాజకీయ హస్తం ఉందా?,రానున్న ఎంపిటీసి,జెడ్పిటిసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలప్రదర్శన జరుగుతోందా? అన్న చర్చలు మండలవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య అంతర్గత పోరు సర్పంచుల ఫోరం వరకూ చేరిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై సంబంధిత ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో, రెండు వర్గాల్లో ఏది అధికారిక ఫోరమో తేల్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.



