సేవ

జీవితంలో అత్యుత్తమమయినది సేవ అంటారు. ‘సేవ అనేది మనిషి సహజ స్వభావం. తోటి వారికి సేవ చేయడం కంటే మెరుగైన పని లేదు’ అంటారు పెద్దలు. సేవ చేసేవారు తాము సంతోషంగా, సుసంపన్నంగా.. సంతృప్తిగా ఉన్నామని చెప్పడం మనం నిత్యం వింటూనే ఉంటాం. బలహీనమైన, నిస్సహాయ, బాధల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేయడంలో అంతటి ఆనందం ఉంటుంది మరి! మనమందరం మనకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో, ఎవరో ఒకరికి, ఏదో ఒక విధంగా సాయం చేసే వుంటాము. ఎందుకంటే ఇది అత్యంత సహజమైన క్రియ. అయితే కొందరికి సేవ ఎలా చేయాలి? ఎవరికి చేయాలి అనే సందేహం వస్తుంది. సేవ చేసే అసలు మార్గం ఏమిటి.. సేవ చేయడానికి డబ్బు అవసరమా. డబ్బు ద్వారా చేసే సేవనే అతి పెద్ద సేవనా అనే అనుమానం కూడా ఉంటుంది?
సేవ చేయడానికి డబ్బు అవసరం కావచ్చు.. అయితే అవసర సమయంలో సేవ చేయడానికి డబ్బుతో పని లేదు. నిజమైన స్ఫూర్తితో చేసే సేవే నిజమైన సేవ. బలహీనమైన, జబ్బుపడి, బాధల్లో, విచారంగా ఉన్న వ్యక్తికి సహాయం చేయడం ఓ మనిషి ప్రధాన కర్తవ్యం. అలా చేయాలంటే సంకుచిత జీవితాన్ని వదిలి పదిమందితో కలిసి జీవితంలో ముందుకు సాగాలి. అయితే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో ఫ్లోరెన్స్‌ నైటింగెల్‌ ఒకరు. ద లేడీ విత్‌ ద ల్యాంప్‌గా గుర్తించబడిన ఆమె ఒక సాధారణ నర్సు. సుమారు 200 ఏండ్ల కిందట పుట్టిన వ్యక్తి. ఇన్నేండ్లయినా ఆమె గురించి మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఆమె చేసిన సేవ. ఈ రోజు ఆమె జయంతి.
ధనిక కుటుంబంలో పుట్టి ఆనాటి రోగుల దీన అవస్థలను చూసి చలించి పోయింది. వారికి సేవ చేయాలని బలంగా కోరుకుంది. నర్సింగ్‌లో శిక్షణ పొంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమందికి తిరిగి జీవితాన్ని ఇచ్చింది. రోగులకు సేవ చేసేందుకే ఆమె పుట్టిందా అన్నంతగా వారి కోసం తపించింది. కేవలం వైద్య సేవలు అందించడంతోనే తన పని పూర్తయ్యిందనుకోలేదు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు అహర్నిశలూ శ్రమించింది. తన తర్వాత కూడా రోగులకు మెరుగైన వైద్యం అందేందుకు అవసరమైన మౌళిక సదుపాయాల కోసం కృషి చేసింది. నిజమైన స్ఫూర్తితో సేవ చేయడం అంటే ఇదే కదా..!
ఇలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని సేవాగుణాన్ని అవరచుకుంటున్న వారి సంఖ్య మన సమాజంలో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యువత సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ సేవా హృదయాన్ని పెంచుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు, తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. సాయం అవసరాన్ని, ప్రాధాన్యతను కరోనా మనకు మరింత నేర్పింది. ఆనాడు వలస కార్మికుల దీన స్థితి చూసి స్పందించిన హృదయాలు ఎన్నో తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి.
అయితే వారి అవసరాల కోసం సేవ చేసే వారు కూడా ఉంటారు. రాజకీయ నాయకులు ఈ కోవకే వస్తారు. మీ సేవకే మేమున్నామంటూ ప్రజల ముందుకు వస్తుంటారు. సేవ చేసేందుకే పుట్టినట్టు ఢాంబికాలు పలుకుతుంటారు. అయితే ఇది ఎన్నికల సమయంలో మాత్రమే. గెలిచిన తర్వాత ముఖం చాటేస్తుంటారు. ఇలాంటి రాజకీయ సేవకుల పట్ల మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి. నిజమైన సేవలకుల నుండి స్ఫూర్తి పొందాలి.

Spread the love