జలమండలిలో సరిపోని ఆదాయం
– రెవెన్యూ పెంపునకు కొత్త సంస్కరణలు
– అక్రమ కనెక్షన్లు, బకాయిలపై దృష్టి
– విజిలెన్స్ విభాగం కేసులు నమోదు
– అందుబాటులోకి ఆన్‌లైన్ సేవలు
నవతెలంగాణ – సిటీబ్యూరో
పని, సేవలు బారెడు.. ఆదాయం మూరెడు అన్న చందంగా తయారైంది హైదరాబాద్ జలమండలి పరిస్థితి. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న జలమండలి రెవెన్యూ పెంచడమే లక్ష్యంగా అధికారులు నూతన సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు. బోర్డుకు వచ్చే ఆదాయం కొత్త ప్రాజెక్టులకు సరిపోవడం లేదు. కేవలం నీటి సరఫరా, సీవరేజ్ సేవల మెరుగుదలకు మాత్రమే ఉపయోగ పడుతోంది. జీతభత్యాలు తదితర ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి అర్హులు కాని వారు, ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకుని వారి నుంచి నల్లా బిల్లులు, బకాయిలపై దృష్టి సారించారు. డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ కనెక్షన్లపై ఆరా తీస్తున్నారు. నష్టాల నుంచి గట్టెక్కేందుకు జలమండలి ఆదాయంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రెవెన్యూ, ఐటీ విభాగాల్లో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో థీమ్ పార్క్‌లో రెవెన్యూ, ఐటీ విభాగ అధికారులతో మేధోమథన సదస్సు నిర్వహించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
నల్లా అక్రమ కనెక్షన్లపై ఆరా..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నగరంలో తాగు నీటి సరఫరా జరుగుతోంది. దాదాపు 14లక్షలకుపైగా నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతిరోజూ కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించి, శుద్ధి చేసిన నీటిని జలమండలి ఇంటింటికీ అందజేస్తోంది. ప్రతి లీటర్ నీటిని తరలించి, శుద్ధి చేయడానికి దాదాపు రూ.48 ఖర్చు చేస్తోంది. ఎంతో విలువైన నీటిని వినియోగించాల్సిన బాధ్యత నగరవాసులపై ఉంది. కానీ కొందరు అక్రమంగా నల్లా కనెక్షన్లను వినియోగిస్తున్నారు. మరికొందరు మీటర్ లేకుండానే నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా నల్లాకే మోటార్ పెట్టి తోడేస్తున్నారు. మరికొందరైతే స్థానిక నాయకులు, కార్పొరేట్ల అండతో నల్లా అక్రమ కనెక్షన్లు తీసుకుంటున్నారు. దాంతో జలమండలికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జలమండలి విజిలెన్స్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసింది.
వాణిజ్య కనెక్షన్లపై దృష్టి
డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్ పరిధిలోని నాన్-రెసిడెన్షియల్ భవనాల జాబితా సేకరించి, వాటిని వాటర్ సప్లై కనెక్షన్లతో పోల్చనున్నారు. దాంతోపాటు అన్ని ఓ అండ్ ఎం, సెక్షన్‌ల వారీగా సరఫరా చేసే నీటి పరిమాణం, పైపు పరిమాణం, మీటర్‌ను బట్టి వివరాల నివేదికలు రూపొందిస్తారు. మీటర్ లేని కనెక్షన్లకు బిల్లింగ్ విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వసూళ్లు చేయాలని నిర్ణయించారు.
అందుబాటులోకి ఆన్‌లైన్ సేవలు
జీహెచ్‌ఎంసీ పరిధిలోని నూతన భవన నిర్మాణదారులకు జలమండలి ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా భవనాలు నిర్మించుకునే వారు జీహెచ్‌ఎంసీ అనుమతుల కోసం సమర్పించాల్సిన వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రాన్ని జారీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసి ఆన్‌లైన్‌లోనే పొందేలాగా సదుపాయాన్ని కల్పించింది. గ్రేటర్ పరిధిలో నూతన భవనం నిర్మించాలంటే జీహెచ్‌ఎంసీ అనుమతి తప్పనిసరి. ఆ పర్మిషన్ కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజబిలిటీతో పాటు జలమండలి జారీ చేసే వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రం సమర్పించాలి. గతంలో ఈ సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో, ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో సీజీఎం జారీ చేసేవారు. వివిధ కారణాల రీత్యా ఈ ప్రక్రియలో జాప్యం జరిగేది. ఆ ప్రక్రియను సులభతరం చేయడానికి ధ్రువపత్రాల జారీని ఆన్‌లైన్‌లోనే పొందేలా మార్పులు చేశారు.