Monday, October 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ స్పైవేర్‌ సంస్థకు ఎదురుదెబ్బ

ఇజ్రాయిల్‌ స్పైవేర్‌ సంస్థకు ఎదురుదెబ్బ

- Advertisement -

వాట్సాప్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవద్దంటూ అమెరికా జిల్లా కోర్టు ఆదేశాలు

కాలిఫోర్నియా : పెగాసస్‌ స్పైవేర్‌ను నిర్వహిస్తున్న ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు అమెరికా జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాట్సప్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవద్దంటూ కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఇంజక్షన్‌ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ కేసులో వాట్సాప్‌ యజమాని అయిన మెటాకు విజయం లభించినట్టయింది. ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ 1,400 డివైస్‌ల్లో చొరబడి ఉల్లంఘనలకు పాల్పడిందంటూ 2019లో వాట్సప్‌ కేసు పెట్టింది. ఈ ఆరోపణలను గతేడాది న్యాయమూర్తి హమిల్టన్‌ నిర్ధారించారు. మెటా వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం శాశ్వత ఇంజక్షన్‌ ఆర్డర్‌ జారీచేసింది.

వాట్సప్‌కు మూడు బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారని, వారి గోప్యతను, భద్రతను కాపాడతామని ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ పత్రంలో హామీ ఇచ్చారని, అయితే వినియోగదారుల ఖాతాల్లోకి ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ చట్టవిరుద్ధంగా చొరబడడంతో వాట్సప్‌కు పూడ్చలేని నష్టం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. శాశ్వత ఇంజక్షన్‌ ఆదేశాలు జారీ చేయాలన్న అభ్యర్థనకు అంగీకరించిన జడ్జి హమిల్టన్‌, గతంలో విధించిన 168 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని నాలుగు మిలియన్‌ డాలర్లకు తగ్గించారు. మార్క్‌ జూకర్‌బర్గ్‌కు చెందిన మెటా సంస్థ వాట్సప్‌, ఫేస్‌బుక్‌, థ్రెడ్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇంజక్షన్‌ ఆదేశాలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ఇతర వేదికలకు కూడా వర్తింపజేయాలన్న మెటా అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -