Saturday, September 13, 2025
E-PAPER
Homeజాతీయంకంగనా రనౌత్‌కు ఎదురుదెబ్బ

కంగనా రనౌత్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -

ఉపశమనం కల్పించేందుకు సుప్రీం నిరాకరణ
రైతుల నిరసనపై ట్వీట్‌కు మసాలా జోడించారని వ్యాఖ్య

న్యూఢిల్లీ : రైతుల నిరసనకు సంబంధించిన ట్వీట్‌పై సుప్రీంకోర్టులో ప్రముఖ సినీ నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ట్రయల్‌ కోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించడంతో ఆమె తరపున న్యాయవాది ఈ పిటిషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని కోరుతూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరవధిక ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనల్లో పంజాబ్‌లోని బహదూర్‌గఢ్‌ జాండియన్‌ గ్రామానికి చెందిన 73 ఏళ్ల మహిందర్‌ కౌర్‌ పాల్గొన్నారు. ఈ ఆందోళనలకు సంబంధించిన ట్వీట్‌ను కంగనా రనౌత్‌ రీట్వీట్‌ చేస్తూ… ఈ ఆందోళనలో షహీన్‌బాగ్‌ దాది కూడా చేరిందంటూ వ్యాఖ్యలు జోడించారు. ఈ పోస్ట్‌పై మహిందర్‌ కౌర్‌ 2021 జనవరిలో బటిండాలోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొన్న మహిళల్లో ఒకరైన బిల్కిస్‌ బానోగా తనను పేర్కొనడం ద్వారా తన పరువుకు కంగనా రనౌత్‌ నష్టం కలిగించారని ఆమె పేర్కొన్నారు. ఐపిసిలోని 499, 500 సెక్షన్ల కింద ఫిర్యాదు నమోదు చేశారు. ప్రాథమిక సాక్ష్యాలను నమోదు చేసిన తర్వాత, 2022 ఫిబ్రవరి 22న విచారణకు హాజరు కావాలని కంగనా రనౌత్‌కు మేజిస్ట్రేట్‌ సమన్లు జారీ చేశారు. మహిందర్‌ కౌర్‌ ఫిర్యాదు, సమన్లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ – హర్యానా హైకోర్టును రనౌత్‌ ఆశ్రయించారు. సమన్ల ఉత్తర్వులు సహేతుకమైనవని, పరువు నష్టం కలిగిందనడానికి తగినన్ని ప్రాథమిక సాక్ష్యాలున్నాయని పేర్కొంటూ హైకోర్టు ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. వాస్తవం తెలిసిన తర్వాత ఫిర్యాదుదారునికి క్షమాపణ చెప్పడంలో రనౌత్‌ విఫలమయ్యారని, లక్షలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఆమె తన వ్యాఖ్యల నిజాయితీని నిరూపించుకోవాల్సిన అదనపు బాధ్యతలు కలిగి ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసును కొనసాగించాలనే మేజిస్ట్రేట్‌ నిర్ణయాన్ని సమర్థించింది.

అవి సాధారణ వ్యాఖ్యలు కావు : సుప్రీంకోర్టు
తనపై దాఖలైన క్రిమినల్‌ పరువు నష్టం దావాను కొట్టివేయాలని కోరుతూ రనౌత్‌ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. విచారణ ప్రారంభంలో, కంగనా రనౌత్‌ వ్యాఖ్యలపై జస్టిస్‌ సందీప్‌ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ”మీ వ్యాఖ్యల సంగతేంటి? ఇది సాధారణ రీట్వీట్‌ కాదు. మీరు మీ స్వంత వ్యాఖ్యలను జోడించారు. మీరు మసాలా జోడించారు,” అని ఆయన వ్యాఖ్యానించారు. పోస్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన వివరణను ఆమె న్యాయవాది సమర్పించారు. దీనికి, జస్టిస్‌ మెహతా స్పందిస్తూ, ఈ వివరణను ట్రయల్‌ కోర్టు ముందు ఇవ్వాలని అన్నారు. ఆమె న్యాయవాది మరింత వాదించడానికి ప్రయత్నించగా, ”ట్వీట్‌లో రాసిన దానిపై వ్యాఖ్యానించాలని మమ్మల్ని అడగవద్దు. ఇది మీ విచారణకు పక్షపాతం కలిగించవచ్చు. మీకు చెల్లుబాటు అయ్యే రక్షణ ఉండవచ్చు” అని జస్టిస్‌ మెహతా పేర్కొన్నారు. ఆమె న్యాయవాది ఆ పిటిషన్‌ను ఉపసంహరిం చుకోవడానికి అంగీకరించారు, ఆ తర్వాత బెంచ్‌ ఈ విషయాన్ని ”తిరస్కరించబడినట్లుగా కొట్టివేయబడింది” అని నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -