Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేయర్‌ పీఠంపై గురి

మేయర్‌ పీఠంపై గురి

- Advertisement -

పీసీసీ ఇలాకా నిజామాబాద్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌
సర్వశక్తులూ ఒడ్డుతున్న బొమ్మ మహేశ్‌గౌడ్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో పురపాలికల్లో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోరు సాగనుంది. ఇది వరకే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పార్టీలు.. కమిటీలు వేసుకొని గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అయితే నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ స్థానం కాంగ్రెస్‌ పార్టీకి కీలకంగా మారనుంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సొంత ఇలాకాలో మేయర్‌ పీఠం గెలవడం ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పైగా ఇక్కడ బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది. మేయర్‌ పీఠంపె గురిపెట్టిన ఆయన.. అది గెలిచి చూపించి జిల్లాపై మరింత పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు.

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో 60 డివిజన్‌లు ఉండగా, మొత్తం 3.48 లక్షల మంది ఓటర్లున్నారు. సొంత జిల్లాలో మేయర్‌ స్థానం గెలవడం పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అత్యంత కీలకంగా మారింది. క్యాడర్‌పై, నాయకులపై మరింత పట్టు సాధించుకోవడంతోపాటు ఆయన నాయకత్వానికి ప్రత్యక్ష రిఫరెండమ్‌ లాంటిది. అందుకే మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మిగతా మున్సిపాల్టీలతో పోలిస్తే నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఇక్కడ గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లాలో వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో, ఆశావహులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్‌ వారీగా స్క్రీనింగ్‌ కమిటీలు ఎంపిక చేయగా.. తొలి సమావేశం సైతం నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంపైనే పెట్టడం విశేషం.

ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకున్నా..
కాంగ్రెస్‌లో బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రస్థానం విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐతో ప్రారంభమైంది. పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చారు. 1994లో డిచ్‌పల్లి నియోజకవర్గం (ప్రస్తుతం నిజామాబాద్‌ రూరల్‌), 2014లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి ఓడిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదనే అపవాదు ఉంది. రెండేండ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌ సీటును షబ్బీర్‌ అలీకి త్యాగం చేయడంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు వరించిన విషయం తెలిసిందే.

గత ఎన్నికల్లో రెండు సీట్లే..
నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలుగా(22 ఏండ్లుగా) కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1999-2004 వరకు డి.శ్రీనివాస్‌ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్‌ గెలవలేదు. ఆ ప్రభావం మున్సిపల్‌ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 సీట్లు గెలవగా, బీఆర్‌ఎస్‌ 13, ఎంఐఎం 16, బీజేపీ 28, ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్‌ పుంజుకోవడం, ఉప ఎన్నికల్లో గెలుపొందడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కొంత మార్పు వచ్చిందన్న అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువగా వచ్చాయి. 60 డివిజన్‌లకు దాదాపు 700 దరఖాస్తులు రావడం గమనార్హం. పార్టీని అంటిపెట్టుకొని, ప్రజల్లో పలుకుబడి ఉన్న వారికే టికెట్‌ ఇస్తామంటున్నారు. ఇది వరకే సర్వేలు సైతం నిర్వహించారు. దాదాపు 40 సీట్లు గెలవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో కలిసి బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -