Monday, June 16, 2025
E-PAPER
Homeదర్వాజసప్తవర్ణ సింగిడి!

సప్తవర్ణ సింగిడి!

- Advertisement -

కని పాలివ్వని తల్లి మీద
కొడుకు తిరగబడ్డట్టు
ఈ నేల మీద ఎల్లకాలం కొట్లాటే!
దక్కాల్సిన బుక్క కోసం
నాలుగు బాటల కాడ
గుండెదరువే సాటింపు!
పేగుబంధం ఎడబాస్తున్నప్పుడో
బతుకలేక దేశం పోతున్నప్పుడో
ఉరిపోసుకోలేక ఊరు ఇడుస్తున్నప్పుడో
లోపటంత ఒక నిశ్శబ్ద యుద్ధం
పచ్చిగాయాల పల్లేరుముల్లు
కలత నిద్రల కలవరింత
కండ్లు ఊటసెలిమలు
పిలిస్తే పలికే కన్నీటి వరద
కలలు ఒలికిపోయినపుడు
ఏ దీపం వెలుగులో వెతుక్కుంటాం
ఇది చిట్టచివరి మనుషుల ఆరాటం
వేరుకు పాదు చేసి
జీవిగంజిపోసినట్టు
అరుదైన దశ్యం!
పొద్దుగూకిన ఆకాశం నుదుటన
ఒకే ఒక్క వర్ణం
బతుకును గెలిచే సాహసికునికి
కొండలు, నదులు…
అన్నీ బాల్యస్నేహితులే
మట్టిని ముద్దాడు
మన్నులో మన్నుగా జీవించు
గొప్ప జ్ఞానం కాకపోయినా
అన్నమైనా లభిస్తుంది
రెక్కలు చాచిన
నేలపొత్తిళ్లలో
పసిపిల్లాడిలా ఎప్పటికీ ఒదిగిపో!
సప్తవర్ణాల సింగిడి
నేల మీదికి
ఉత్తకాళ్లతో దిగివస్తుంది…
తప్పిపోయి దొరికినోడిని చూసినట్టు
ఒక ఆత్మీయ ఆలింగనంతో అల్లుకుంటుంది
పచ్చిపచ్చిగా నిన్ను నీకే
మళ్లీ కొత్తగా పరిచయం చేస్తుంది!
– డా.పసునూరి రవీందర్‌, 7702648825

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -