పట్టాలు తప్పిన ఐదు బోగీలు
ప్రయాణికులు సురక్షితం : నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే
గువహతి : అసోంలోని హొజాయ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. మిజోరాంలోని సైరాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ గజరాజుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరొకటి తీవ్రంగా గాయపడింది. తొలుత ఎనిమిది ఏనుగులు చనిపోయాయని అధికారులు భావించారు, ఆ తర్వాత వాటిలో ఒకటి గాయపడినట్టు గుర్తించి వెటర్నరీ డాక్టర్‌తో చికిత్స చేయించారు. కాగా ఈ ప్రమాదం తెల్లవారు జామున 2.17గంటలకు చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదం ధాటికి రైలు ఇంజనుతో సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే తెలిపింది. రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తొమ్మిది రైళ్లను దారి మళ్లించగా, 13 రైళ్లను క్రమబద్ధీకరించారు. రెండు రైళ్లను కుదించినట్టు అధికారులు వెల్లడించారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను ఇతర చోట్ల ఖాళీల్లో సర్దుబాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతానికి ఉన్నతాధికారులు చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఉదయం 6.11 గంటలకు గౌహతి నుంచి రైలు బయలుదేరింది.
ఎలిఫెంట్ కారిడార్‌లో ప్రమాదం
పొగమంచు దట్టంగా వుండడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్టు నాగావ్ డివిజన్ అటవీ అధికారి సుహాస్ కదమ్ తెలిపారు. ఏనుగుల కారిడార్‌గా ప్రకటించిన లుమ్‌డింగ్ డివిజన్ పరిధిలోని జమునాముఖ్ – కంపూర్ సెక్షన్‌లో ప్రమాదం జరిగిందని ఎన్‌ఎఫ్‌ఆర్ ముఖ్య ప్రతినిధి కపింజల్ శర్మ తెలిపారు. రైలు డ్రైవర్ ఎమర్జన్సీ బ్రేక్‌లు వేశాడని, అయినా ట్రైన్ ఏనుగులను ఢీకొందని చెప్పారు. ఏడు ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇక్కడికి దగ్గరగానే వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.



