Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్పిడుగులు పడి ఏడుగురు మృతి

పిడుగులు పడి ఏడుగురు మృతి

- Advertisement -

ఇద్దరి పరిస్థితి విషమం
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల/ఆదిలాబాద్‌/గుండాల

రాష్ట్రంలో బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో ఒక్కసారిగా వర్షంతోపాటు పిడుగులు పడటంతో ఏడుగురు మృతిచెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా పొలం పనుల్లో ఉండగా వర్షం పడింది. గద్వాల, నిర్మల్‌, ఖమ్మం జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని భూమూర్‌, పుల్లికల్‌ గ్రామాల్లో పిడుగుపాటు ఘటన ఐదు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలలోకి వెళితే.. భూమూర్‌ గ్రామ రైతు పండ్ల తిమ్మప్ప పత్తి చేనులో పత్తి తీసేందుకు బుధవారం పుల్లికల్‌ గ్రామం నుంచి ముగ్గురు, భూమూర్‌ నుంచి ముగ్గురు కూలీలు వచ్చారు. సాయంత్రం 4గంటల సమయంలో వర్షం ప్రారంభమైంది.

ఆ సమయంలో కూలీలు పొలం గట్టుపై ఉన్న తాటిచెట్టు కిందకు వెళ్లారు. ఉన్నట్టుండి భారీ శబ్దంతో చెట్టుపై పిడుగు పడింది. దాంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. అందులో భూమూర్‌ గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, తిప్పమ్మ దంపతుల కొడుకు సర్వేసు(24), నాగరాజు భార్య ఈడిగి పార్వతి(34), పుల్లికల్‌ గ్రామానికి చెందిన సౌభాగ్య(36) ఉన్నారు. పుల్లికల్‌కు చెందిన జ్యోతి, రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. వీరిపరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించే సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పోలీసులు, ప్రజా ప్రతినిధులు వారికి నచ్చజెప్పారు.

నిర్మల్‌ జిల్లాలో..

నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో భార్యాభర్తలు, ఓ కూలి ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్‌కు చెందిన రైతు దంపతులు ఎల్లయ్య, ఎల్లవ్వతోపాటు రైతు కూలి వెంకటి పొలంలో పనులు చేస్తున్నారు. సాయంత్రం సమయంలో వర్షంతోపాటు పిడుగు పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మొక్కజొన్న చేనులో రైతు మృతి
భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమలగూడెం గ్రామానికి చెందిన పాయం నర్సయ్య(50)పై పిడుగుపడి మృతిచెందాడు. మొక్కజొన్న చేను వద్ద ఆయన మంచెపై కూర్చున్న సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. ఉదయం చేను పనికి వెళ్లిన నర్సయ్య రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులకు విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుండాల ఎస్‌ఐ సైదారా వూఫ్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad