Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంఎఫ్‌సీఆర్‌ఏతో మైనారిటీల్లో తీవ్ర భయాందోళనలు

ఎఫ్‌సీఆర్‌ఏతో మైనారిటీల్లో తీవ్ర భయాందోళనలు

- Advertisement -

తక్షణమే సవరణలు ఉపసంహరించాలి
ప్రధాని మోడీకి కేరళ సీఎం విజయన్‌ లేఖ
తిరువనంతపురం :
విదేశీ విరాళాల (క్రమబద్ధీకరణ) చట్టానికి తీసుకువచ్చిన ప్రతిపాదిత సవరణల పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఈ చట్టం వల్ల మైనారిటీ కమ్యూనిటీల్లో, మత సంస్థల్లో కేంద్రం భయాందోళనలు సృష్టించిందన్నారు. తక్షణమే కేంద్రం తన వైఖరిని పున: పరిశీలించుకోవాలని, ప్రతిపాదిత సవరణను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రతిపాదిత సవరణతో కేరళలో తీవ్ర దుమారం రేగింది. కొత్త సవరణల ద్వారా ఎన్‌జీఓలపై, మత సంస్థలపై పూర్తిగా నియంత్రణ సాధించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని సీపీఐ(ఎం) తీవ్రంగా విమర్శించింది. అటు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూడా విమర్శలు చేసింది. కేరళలో అనేక చర్చిలు, విద్యా సంస్థలు, చారిటబుల్‌ ఆస్పత్రులు విదేశీ విరాళాలు అందకుంటూ వుంటాయి. ప్రతిపాదిత సవరణల వల్ల ఆసంస్థల్లో భయం నెలకొంది. చర్చిలు ద్వారా నిర్వహించే తమ ఆస్తులను ప్రభుత్వం లాక్కుంటుందనే ఆందోళన మొదలైంది. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే వాటిపై చర్యలు తీసుకునేందుకు అవసరమైన నిబంధనలు ఒరిజినల్‌ ఎఫ్‌సీఆర్‌ఏలో వున్నాయని విజయన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ మైనారిటీ సంస్థలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ మైనారిటీ సంస్థలు, సంఘాలు వ్యక్తం చేసే ఆందోళనలు హేతుబద్ధమైనవేనని, పైగా తీవ్రమైనవని విజయన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ కూడా కేంద్ర వైఖరిని తీవ్రంగా విమర్శించారు. కొట్టాయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ చర్య, మైనారిటీలపై కత్తి వేలాడదీసినట్లేనని వ్యాఖ్యానించారు. క్రైస్తవ కమ్యూనిటీలను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన చర్య అని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -