సంక్షోభంలో పేదలు.. సంపాదనలో పెద్దలు
మోడీ పదేండ్ల పాలనలో సామాన్యుడి దుస్థితి
1688 మందికి రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు
అతి సంపన్నులపై పన్నులు విధించాలి
అది సామాజిక సంక్షేమానికి ఉపయోగకరం
‘వెల్త్ ట్రాకర్ ఇండియా 2026’ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : మోడీ పాలనలో గత దశాబ్ద కాలంలో భారత్‌లో అసమానతలు తీవ్రంగా పెరిగాయి. పేదలు సంక్షోభాన్ని ఎందుర్కొంటున్నారు. మరోపక్క ధనికుల సంపద మాత్రం గణనీయంగా పెరిగింది. తాజా ‘వెల్త్ ట్రాకర్ ఇండియా 2026’ నివేదిక ఈ అసమానతను స్పష్టంగా చూపిస్తోంది. అయితే సంపన్నులపై పన్నులు విధిస్తే అది సామాజిక సంక్షేమానికి ఉపయోగపడుతోందని కూడా సూచిస్తోంది.
తీవ్ర ఇబ్బందుల్లో పేద, మధ్య తరగతి
కేంద్రంలోని మోడీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలు బ్యాంకుల ముందు క్యూలలో నిలబడ్డారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో అసంఘటిత రంగ కార్మికులు నగరాల నుంచి గ్రామాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ పరిస్థితి మారలేదు. ధరలు పెరగడం, వేతనాలు స్థిరంగా ఉండటం వల్ల ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. ఇప్పుడు మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో గృహిణులకు ఇబ్బందులు తప్పటం లేదు. పేద, మధ్య తరగతి ప్రజలు మళ్లీ కష్టాల్లో పడిపోయారు. ముఖ్యంగా నగరాల్లో పని చేసే వలసకార్మికుల వారి గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు ‘సహించాలి’ అంటూ సలహానే ఇస్తోంది. తక్షణ సమస్యలకు పరిష్కార కోరవద్దనీ, దీర్ఘకాల ప్రయోజనాల కోసం కష్టాలను భరించాలని దేశ ఆర్థిక సలహాదారు సూచిస్తుండటం గమనార్హం.
‘క్యాపిటల్ ఫ్లైట్’ భయం
దేశంలోని అతి సంపన్నులపై పన్ను వేస్తే వారు దేశం వదిలి వెళ్లిపోతారని ఒక వాదన ఉంది. దీనిని నివేదిక ‘భయపెట్టే కథ’గా అభివర్ణించింది. భారత్‌లో కంపెనీల లాభాలు పెరిగినా, ఉద్యోగాలు పెరగడం లేదు. వేతనాలు కూడా పెరగడం లేదు. పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు జీడీపీలో 0.6 శాతం మాత్రమే. అంటే ధనికులు తమ లాభాలను దేశ అభివృద్ధికి వినియోగించడం లేదని నివేదిక వివరిస్తోంది. అతి సంపన్నులపై పన్ను వేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం కలుగుతోందని సూచిస్తోంది.
సంపన్నులపై పన్నులు అవసరం
ఈ నివేదిక ప్రకారం… అత్యంత ధనికులపై తక్కువ శాతం పన్ను విధించినా భారీ మార్పులు సాధ్యమవుతాయి. ఉదాహరణకు, ముఖేశ్ అంబానీ సంపదపై రెండు శాతం పన్ను వేస్తే.. దేశంలోని ప్రతి పదో తరగతి విద్యార్థికి మూడు సంవత్సరాల పాటు ఉచిత ల్యాప్‌టాప్ ఇవ్వవచ్చు. అలాగే గౌతమ్ అదానీ సంపదపై పన్ను వేస్తే.. దేశ ప్రజలకు రెండు ఏండ్ల పాటు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించొచ్చు. ఇక సావిత్రి జిందాల్ సంపదపై పన్ను వేస్తే.. దేశంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యను దశాబ్దం పాటు కొనసాగించొచ్చు. దేశంలోని 1688 మంది అతి సంపన్న కుటుంబాలపై రెండు శాతం నుంచి ఆరు శాతం వరకు పన్ను విధిస్తే.. ఏడాదికి రూ.10.63 లక్షల కోట్లు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిధులతో ఆరోగ్యం, విద్యపై ఖర్చు పెంచడం, వృద్ధులకు నెలకు రూ.12 వేల పెన్షన్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు అమలు చేయవచ్చు.
అసమానతలు పెరుగుతున్న విధానం
దేశంలో ధనికుల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, రుణ మాఫీలు, ప్రయివేటీకరణ వంటి చర్యలతో వారి సంపద భారీగా పెరిగింది. 1991లో భారత్‌లో ఒకే ఒక బిలియనీర్ ఉండగా.. 2025 నాటికి ఈ సంఖ్య 358కి పెరిగింది. ప్రస్తుతం 1688 మంది వ్యక్తులు రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. వీరి మొత్తం సంపద రూ.166 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో సుమారు 50 శాతానికి సమానం. కోవిడ్ తర్వాత ఆరు సంవత్సరాలల్లో దేశంలోని ఐదు అతిపెద్ద కుటుంబాల సంపద 400 శాతం పెరిగింది. అదే సమయంలో దిగువ 50 శాతం మంది ప్రజల సంపద వాటా 6.8 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది.



