పరోక్షంగా కాంగ్రెస్ సహకారం
కేరళం చరిత్ర రాహుల్‌గాంధీకి అర్థం కావట్లేదు : సీపీఐ(ఎం)అగ్రనేత ప్రకాశ్ కరత్
తిరువనంతపురం : దేశాన్ని పాలిస్తున్న హిందుత్వ శక్తులు దేశవ్యాప్తంగా మతపరమైన విభజనను తీవ్రతరం చేస్తుండగా, కాంగ్రెస్ పరోక్షంగా ఈ ప్రక్రియను సులభతరం చేసే వైఖరిని అవలంబిస్తోందని సీపీఐ(ఎం) అగ్రనేత ప్రకాశ్ కరత్ అన్నారు. కాంగ్రెస్ యొక్క ”మృదువైన హిందూత్వ” విధానం కేరళంలో కూడా హిందూత్వ శక్తులను బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు. ఉత్తర కేరళంలో ఎల్‌డీఎఫ్ ఎన్నికల ర్యాలీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మైనారిటీలు తీవ్రమైన దాడులను ఎదుర్కొంటున్నారని, మతపరమైన వేడుకలను కూడా వారిపై హింసకు వేదికగా మారుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మతతత్వాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండగా, మతపరమైన విభజన ప్రయత్నాలను ప్రతిఘటించడం ద్వారా కేరళం పురోగమించి, భిన్నంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
రాహుల్‌గాంధీకి కేరళం చరిత్ర అర్థం కావడం లేదని ప్రకాశ్‌కరత్ వ్యాఖ్యానించారు. సీపీఐ(ఎం) కేరళంలో ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్ రెండింటికీ వ్యతిరేకంగా చేసిన పోరాటాల ద్వారా ఎదిగిందని, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. కేరళంతో పాటు ఎన్నికలు జరుగుతున్న అసోంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కాషాయ వస్త్రాలు ధరించి బీజేపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ తీవ్రవాద సంస్థలు కూడా హిందూత్వ తీవ్రవాద శక్తులంత ప్రమాదకరమైనవని, ప్రస్తుత ఎన్నికలలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అటువంటి గ్రూపులతో పొత్తు పెట్టుకుంటోందని ఆయన ఆరోపించారు.



