జన సంచారంలోనే అఘాయిత్యం
ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
దుండగుల దురాఘతాలకు చిన్నారులే కాదు వృద్ధులు కూడా బలవుతున్నారు. తాగిన మైకంలో ఒంటరిగా ఉన్న మహిళలు, చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వృద్ధురాలైన యాచకురాలిపై లైంగికదాడి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో 70 ఏండ్ల యాచకురాలిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు లైంగికదాడి చేశాడు. మంగళవారం తెల్లవారుజామున వృద్ధురాలి తలకు గాయమై రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించిన స్థానికులు 108కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. వృద్ధురాలిపై సుమారు 40 ఏండ్ల గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడినట్టు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు.
రద్దీ ప్రాంతంలో తలదాచుకున్న..
ఆర్టీసీ బస్టాండ్‌లో నిత్యం ప్రజలు సంచరిస్తారని, తనకి రక్షణ ఉంటుందని ఆ వృద్ధురాలు భావించింది. కానీ జన సంచారం తిరిగే ప్రాంతాల్లోనే దుండగుడి చేతిలో బలైంది. ఆ వృద్ధురాలు ప్రతిఘటించే ప్రయత్నంలో తలకు బలమైన గాయమైంది.