– ఎస్‌ఎఫ్‌ఐ హెల్ప్‌లైన్ డెస్క్‌ను సంప్రదించిన వందలాది మంది విద్యార్థులు
– జమ్మూకాశ్మీర్, పంజాబ్, చండీగఢ్ నుంచి వచ్చిన వారికి ఢిల్లీలో వసతి
– వీరి కోసం ప్రత్యేక రైళ్లుఅందుబాటులోకి తేవాలని రైల్వే మంత్రికి లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ ఆశ్రయం కల్పించింది. అక్కడ చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ డెస్క్‌ను వందలాది మంది విద్యార్థులు సంప్రదించారు. వీరిని సరైన సమయంలో సురక్షితంగా తమ ప్రాంతాలకు తరలించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ ఎంతో సహాయపడింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి దీప్షితా దార్, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సూరజ్ ఎలామోన్, ఐషీఘోష్, కేంద్ర కమిటీ సభ్యుడు అభిజిత్ మణిలాల్, ఢిల్లీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోహినా ఫాతిమా, ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అనిల్ సేతుమాధవన్‌లతో కూడిన ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధి బృందం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికింది. వారికి ఢిల్లీలోని హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో వసతి కల్పించారు. అక్కడ వారిని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు ఎంఎ బేబీ కలిసి మాట్లాడారు. హెల్ప్‌లైన్ డెస్క్ ఇప్పటికీ అందుబాటులో ఉందని, తమను ఆశ్రయించే ప్రతి విద్యార్థికి సహాయపడతామని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ అన్నారు. సరిహద్దు ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలలో పోరాడుతున్న విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ సంఘీభావం తెలుపుతుందన్నారు.
హింసాత్మక ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రస్తుత పరిస్థితులు
జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ అన్నారు. ఈ ప్రాంతాలలో దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు చదువుకుంటున్నారని, ప్రస్తుతం, పాఠశాలలు, అనేక విద్యా సంస్థలు మూసివేయబడ్డాయని తెలిపారు. కానీ, సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తమ ఇండ్లకు వెళ్లలేకపోతున్నారని అన్నారు. అంతేకాక అనేక సంస్థల్లో విద్యార్థులు బయటకు వెళ్లడానికి అనుమతించబడలేదని, ఈ కల్లోల సమయాల్లో వీలైనంత త్వరగా విద్యార్థులు తమ కుటుంబంతో చేరగలిగేలా సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభావిత, దుర్బల ప్రాంతాలలోని సామాన్య ప్రజలను తరలించాలని, రవాణా సౌకర్యాన్ని అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిశ్వాస్, సంయుక్త కార్యదర్శి ఆదర్శ్ ఎం. సాజి, ఎస్. శిల్పతో కలిసి భటిండాలోని పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీని, క్యాంపస్‌లోని విద్యార్థులను కలిశారు. పంజాబ్‌లోని భటిండాలో పాకిస్తాన్ సైన్యం చేసిన డ్రోన్ దాడిని మన సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందని అన్నారు. ఈ సంఘటన పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ హాస్టల్ సమీపంలో జరిగిందని, విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి జోక్యం చేసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విశ్వవిద్యాలయ అధికారులను కలిశారు. పరిస్థితి మరింత భయానకంగా మారకుండా నిరోధించడానికి, ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇది పౌర నష్టాలకు దారితీయడంతో పాటు దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి, విద్యార్థులకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తేవాలి
హింసాత్మక ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటు లోకి తేవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళన కరంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న విద్యార్థులకుఎస్‌ఎఫ్‌ఐ ఆశ్రయం
- Advertisement -
- Advertisement -