వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈనెల 17,18 తేదీల్లో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర యూనివర్సిటీల కనెన్షన్ జరగనుంది. ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వర్సిటీల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈనెల 17న మొదటిరోజు విద్యార్థి ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందన్నారు. ముఖ్య అతిథులుగా ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి అయిషీ ఘోష్ హాజరవుతారని వివరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. వర్సిటీలకు కేటాయించే బడ్జెట్ కేవలం జీతాలకు మాత్రమే సరిపోతు న్నాయని అన్నారు.
కనీసం నూతన కోర్సులను కూడా ప్రవేశపెట్టని పరిస్థితి ఉందన్నారు. రానున్న బడ్జెట్లో వర్సిటీల అభివృద్ధికి అధిక బడ్జెట్ కేటాయిం చాలని డిమాండ్ చేశారు. వర్సిటీల్లో విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్సిటీలకు వీసీలను నియమించినా అభివృద్ధి జరగడం లేదని చెప్పారు. బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను ఎప్పటిలోపు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఖాళీలను భర్తీ చేయకుండా విద్యార్థులు ఎలా చదువుకుంటారని అడిగారు. పీజీ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చి విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు విద్యకు దూరమైతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని కోరారు. హాస్టళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.
విద్యార్థులకు ఉచితంగా మెస్ కార్డులను అందించాలని సూచించారు. హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. పీహెచ్‌డీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫెలోషిప్‌లను ఇవ్వాలని చెప్పారు. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)ని ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ కన్వెన్షన్‌లో విద్యారంగ సమస్యలు, వర్సిటీల బలోపేతం కోసం చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి కిరణ్, అశోక్‌రెడ్డి, మమత, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
17,18 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



