ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్
ప్రభుత్వ ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, యాజమాన్యాలు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాక విద్యార్థులు, నిధులు లేక కళాశాలల యాజమాన్యాలు అనేక అవస్థలు పడుతున్నాయనీ, దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నేటి నుంచి మూడు రోజులు పాటు వివిధ రూపాల్లో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. శుక్రవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ ఆందోళనలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆ సంఘం నేతలు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ రజినీకాంత్, టి నాగరాజు, కేంద్ర కమిటీ సభ్యురాలు పూజ మాట్లాడారు. రాష్ట్రంలో ఆరేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్‌లు, స్కాలర్ షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. దీనివల్ల కాలేజీల నిర్వాహణ, విద్యార్థుల భవిష్యత్ ఆగమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలకు తెచ్చి విద్యాసంస్థలను నడపలేమంటూ యజమాన్యాలు పరీక్షలను బారు కాట్ చేస్తున్నాయని తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ రానందున బకాయిలు చెల్లిస్తేనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తామని మెలిక పెడుతున్నారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని విమర్శించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,ఈడబ్ల్యూఎస్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని ఆపార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో హామినిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 13లక్షల మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికేట్ల కోసం కాలేజీలు చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. యాజమాన్యాలు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ముడిపెట్టటంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. కొన్ని కళాశాలలు విద్యార్థులనుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా శనివారం (5వ తేదీ) మండల, పట్టణ, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, 6న ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు, 7న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్త ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES