– అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించండి
– కామారెడ్డి మున్సిపల్ ప్రజలకు పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ 9, 10, 11, 12, 13, 32 వార్డుల్లో సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కామారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తనదేనని, ఒకవేళ అభివృద్ధి చేసి చూపించలేకపోతే మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోతానని పేర్కొన్నారు. ప్రచార సభలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు కామారెడ్డి భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని తెలిపారు. ప్రజల మద్దతుతో పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
“అవినీతి తిమింగలాలకు జైలు తప్పదు”
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ ఆధారాలు బయటపడతాయనే భయంతో ఎఫ్‌ఎస్‌ఎల్ డేటా సెంటర్‌ను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారు త్వరలోనే చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని, లక్షల కోట్లు దోచుకున్నవారు జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని హెచ్చరించారు. అవినీతి గురించి మాట్లాడుతున్న నాయకుల గతం అక్రమాలతో నిండిపోయిందని విమర్శించారు.
“కనికట్టు మాటలకు మోసపోవద్దు”
కులాలు, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రలోభాలకు లొంగి విలువైన ఓటును వృథా చేయవద్దని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇస్తున్న నాయకులను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
“కాంగ్రెస్‌తోనే కామారెడ్డి ప్రగతి పథం”
కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు కామారెడ్డి అభివృద్ధికి ఒక మెట్టుగా మారుతుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. అధికార పార్టీ సహకారంతోనే మున్సిపాలిటీకి వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. స్థానిక సమస్యలపై మౌనం పాటించి ఎన్నికల ముందు మాత్రమే హామీలు ఇస్తున్న బీజేపీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకత్వంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన వారు ఇప్పుడు ఓట్ల కోసం ముందుకు రావడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో మార్పు ప్రారంభమైందని పేర్కొంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని షబ్బీర్ అలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



