Saturday, May 3, 2025
Homeఎడిట్ పేజిపత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు… ప్రజాస్వామ్యానికి ప్రమాదం

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు… ప్రజాస్వామ్యానికి ప్రమాదం

- Advertisement -

మధుపాళి
1993 నుంచి ప్రతియేటా 03 మే రోజున ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ”ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం (వరల్డ్‌ పిరెస్‌ ఫ్రీడం డే)” నిర్వహిస్తున్నది. 1991లో పత్రికా స్వేచ్చ, స్వాతంత్య్రం, బహువచన పత్రికారంగం కోసం ”విండ్‌హాక్‌ డిక్లరేషన్‌” చేసిన సందర్భానికి గుర్తుగా ఈ రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పత్రికారంగ సంక్లిష్ట సమస్యలు, జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకురావడం, పత్రికారంగానికి చెందిన పాలసీలు తీసుకురావడం, మీడియా వ్యక్తులు, పౌర సమాజ పాత్రలను చర్చించడానికి ఈ వేదికలను వినియోగించడం జరుగుతోంది. కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కడంతో పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు కూడా ప్రభావితం కావడం చూస్తున్నాం. ఇదే వేదికగా విధి నిర్వహణలో అమరత్వం పొందిన జర్నలిస్టుల సేవలను గుర్తు చేసుకోవడం, పత్రికా స్వేచ్ఛ కాపాడటంలో ప్రభుత్వాల పాత్రను గుర్తు చేయడం కూడా జరుగుతుంది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం-2025 ఇతివృత్తంగా ”డిజిటల్‌ యుగంలో రిపోర్టింగ్‌ : పత్రికా స్వేచ్ఛపై ఏఐ ప్రభావం” అనబడే అంశాన్ని తీసుకొని అవగాహన కల్పిస్తున్నది. నవ్య సాంకేతిక విప్లవ తుఫానులో జర్నలిస్టుల విధులు కూడా పునర్నిర్వచించబడడం, అన్వేషణాత్మక రిపోర్టింగ్‌లో కొత్తదారులు తెరుచుకోవడం, సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం, నిజనిర్ధారణకు నవ్య మార్గాలు ఏర్పడడం, బహు భాషల సమాచారం అందుబాటులోకి రావడం కనిపిస్తున్నది. డాటా విశ్లేషణ తేలిక కావడం లాంటి ప్రధాన ప్రయోజనాలే కాకుండా ఏఐతో తప్పుడు సమాచారాలు, సమాచారం అందకపోవడం, డీప్‌ఫేక్‌ టెక్నాలజీ తిప్పలు లాంటివి కూడా ఉన్నాయి. పక్షపాత సమాచారం, జర్నలిస్టులపై నిఘా పెరగడం, పని సమానమైన వేతనాలు అందకపోవడం, ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా స్వార్థపర రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లడం, పత్రికా రంగ విలువలు పలుచబడడం ఈ దశాబ్దకాలంగా పెరిగింది. ఎల్లో జర్నలిజం పురుడు పోసుకోవడం, జర్నలిస్టులపై హత్యాప్రయత్నాలు జరగడం, విలేకరుల కలం నోళ్లు నొక్కడం, జర్నలిజంలో రాజకీయాలు ప్రవేశించడం లాంటి అవలక్షణాలు కూడా ఈ కాలంలోనే బాగా పుట్టుకొచ్చాయి.పెట్టుబడిదారులు సైతం మీడియాలోకి ప్రవేశించడం అతిపెద్ద సమస్యగా పరిణమించింది. ఇలాంటి ధోరణలు, సమస్యల మధ్య పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడమంటే కత్తిమీద సామే?
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం వేదికగా మీడియా స్వేచ్ఛకు సంబంధించిన మౌలిక సూత్రాలపై దృష్టి సారించడం, నిష్పక్షపాతంగా రిపోర్టింగ్‌ చేయడానికి తగు స్వేచ్ఛను కల్పించడం చేయాలి. రాజకీయ ప్రమేయాలను తగ్గించడం, నిజాయితీ కలిగిన జర్నలిస్టులపై జరిగే దాడులను ఖండించడం, అక్రమార్కుల భరతం పట్టడం, పారదర్శకత పాటించడం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం జరగాలి. ప్రపంచ స్థాయి ఐక్యత సాధించడం, వివిధ మీడియా గ్రూపులను ఐక్యంగా కలుపకోవడం, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించే అంతర్జాతీయ వేదికలను ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం లాంటి అంశాలను చర్చించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం.
రాజకీయ, చట్టపరమైన, ఆర్థిక, సామాజిక అంశాలు పత్రికాస్వేచ్ఛను ప్రభావితం చేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడితే అన్యా యమే రాజ్యమేలుతుంది, పేదరికం వెక్కిరిస్తుంది. సమన్యాయం, అభివృద్ధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఆందోళనకరంగా మారుతుంది. అందుకే పత్రికాస్వేచ్ఛ ద్వారా ప్రజాస్వామ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రజలకు అనేక విషయాల్లో అవగాహనతో పాటు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. నేటి పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, మీడియా మిత్రుల భద్రత లాంటివి రేపటి సమసమాజ స్థాపనకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలే కానీ, గొంతునొక్కేలా వ్యవహరించకూడదు. అలా నిజాల్ని మరుగున పరిచే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తు తరం పాలకవర్గాలను క్షమించదన్న విషయం గమనించుకోవాలి.
(నేడు ”ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం”)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -