Monday, December 29, 2025
E-PAPER
Homeమానవిరక్తహీనత గురించి తెలుసుకుందామా?

రక్తహీనత గురించి తెలుసుకుందామా?

- Advertisement -

దీనినే ఆంగ్లంలో ‘అనీమియా’ అంటారు. రక్తంలో ఉండేటటువంటి ఎర్ర కణాలు సాధారణంగా ఉండవలసిన సంఖ్య/వాటిలో ఉండే హిమోగ్లోబిన్‌ అనే ఇనుముతో కూడిన ప్రొటీన్‌ ఉండవలసిన మోతాదులో లేకపోవడం వలన తలెత్తే పరిస్థితినే రక్తహీనత అంటారు. సాధారణంగా మహిళలు, అమ్మాయిలలోనే ఈ సమస్య అధికంగా వుంటుంది.

ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌ మనం పీల్చే గాలినుండి ఆక్సిజన్‌ ను శరీరంలోని ప్రతి సజీవ కణానికి చేరవేస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినా హిమోగ్లోబిన్‌ మోతాదు తగ్గినట్టే పర్యవసానంగా కణాలకు జీవ వాయువైన ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది.

అధ్యనాలు ఏం చెబుతున్నాయి…
మనిషి శరీరంలో కొంత లింగ-వయసుపరమైన భేదాలతో, ప్రతి మిల్లీలీటర్‌ రక్తంలో నాలుగున్నర నుండి ఐదు మిల్లియన్ల ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ పిల్లల్లో వంద మిల్లీలీటర్ల రక్తంలో పదకొండు, ఆడవారిలో పన్నెండు, మగవారిలో పదమూడు గ్రాములు కన్నా తక్కువగా ఉందంటే అది రక్తహీనతే. దీనిని ఒక జబ్బుగా కాకుండా ఒక శారీరిక పరిస్థితిగా మాత్రమే పరిగణించవచ్చు. మన దేశంలో యాభై ఏడు శాతం ఆడవారు, అరవై ఏడు శాతం పిల్లలు, మగవారిలో ఇరవై ఐదు, మగపిల్లల్లో ముప్పై, ఆడపిల్లల్లో యాభై తొమ్మిది, యాభై రెండు శాతం గర్భిణీ స్త్రీలలో రక్తహీనత విస్తతంగా ప్రబలి ఉన్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. ఆహారంలో ఇనుము, ఫోలిక్‌ ఆసిడ్‌ కొరత, పరాన్నజీవుల వల్ల కలిగే అనారోగ్యం, సాంఘిక తారతమ్యాలు, జీవన శైలి ప్రధాన కారకాలుగా ఈ అధ్యయనాలు పేర్కొన్నాయి.

రక్తహీనత ఎలా ఏర్పడుతుంది?
సామాన్యంగా రక్తహీనత రక్తం ఎక్కువగా కోల్పోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ రకమైన రక్తహీనత మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో రుతుక్రమ సమయంలో, మాములుగా జరుగవలసిన (మూడు నుండి ఐదు రోజులు-ముప్పయి నుండి యాభై మిల్లీలీటర్ల) మోతాదును మించి రక్తస్రావం జరగడం వలన ఇది ఏర్పడుతుంది. దీర్ఘకాలంగా అధిక రక్తస్రావానికి, పోషకాహారలోపం తోడైతే, కొంత రక్తనష్టానికే రక్తహీనత ఏర్పడే అవకాశముంది.

అనేక వ్యాధుల వల్ల
కడుపులో అల్సర్లు, ప్రేగు క్యాన్సర్‌ వంటి సమస్యలు, అంతర్గత రక్తస్రావానికి దారి తీసే మరి కొన్ని వ్యాధులు వలన కూడా రక్తహీనత ఏర్పడవచ్చు. రక్తకణాల, హిమోగ్లోబిన్‌ ఉత్పత్తికి అవసరమయ్యే ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, రాగి, జింక్‌, తదితర మినరల్స్‌, విటమిన్లు, రోజువారీ మోతాదులో తీసుకోని వారిలో వీటి ఉత్పత్తి సహజంగానే తగ్గిపోతుంది. తరుచుగా శరీరంలో వీటి కొరత ఎక్కువగా ఆహారలోపం వలన కలిగే అవకాశమున్నది. జన్యు పరమైన మార్పులు- సిక్స్‌ సెల్‌ అనీమియా అనబడే రక్తహీనత జన్యుపరంగా పుట్టుకతోనే ఉంటుంది.

ఎవరిలోనైనా కలగవచ్చు
ఇన్ఫెక్షన్‌ లు-మలేరియా, కడుపులో ఉండే నులిపురుగులు (హుక్‌ వార్మ్‌ ఇన్ఫెక్షన్‌), దీర్ఘకాలిక అమిబియాసిస్‌ వల్ల చిన్న పిల్లల్లోనే కాక పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుంది. అలాగే కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల ఎర్రరక్తకణాలు, వాటి సహజ జీవిత కాలం, (సామాన్యంగా నూరు నుండి నూట ఇరవై రోజులు) కంటే చాలా ముందుగా అంతరించి పోవడం వలన రక్తహీనత కలగవచ్చు. నవజాత శిశువుల నుండి వయోవద్దులవరకు, ఆడ-మగ భేదం లేకుండా ఏవరిలోనైనా ఈ సమస్య రావొచ్చు. దీని వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంది.

ఇవి కూడా కారణాలే…
శరీరంలో ఎక్కడైనా అంతర్గతంగా రక్తస్రావం జరుగుతూ ఉండటం, విటమిన్‌ బి ట్వెల్వ్‌ కొరత, బోన్‌ మారో సమస్యలు, ఇర్రిటేబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) వంటివి రక్తహీనతకు దారి తీస్తాయి. పోషకాహార లోపంతో వచ్చే రక్తహీనత.. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డకు పాలిచ్చే నెలల్లో సరైన ఆహారం తీసుకోక పోవడం వలన తరచుగా జరుగు తుంటుంది తీసుకున్న ఆహారంలో పోషక విలువలు ఉండకపోవడం, మలంలో రక్తం పడటం వంటి కారణాలు కూడా రక్తహీనతకు కారణం కావొచ్చు కొన్ని కిడ్నీ, లివర్‌, థైరాయిడ్‌ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లు వంటి దీర్ఘకాల వ్యాధులను కలిగి ఉన్న వారిలోనూ ఈ రక్తహీనత సమస్య రావొచ్చు.

రక్తహీనత లక్షణాలు
లక్షణాలు సాధారణంగా/ తీవ్రంగానూ ఉండవచ్చు. కళ్లు తిరగడం, నిద్ర పట్టకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం వంటి సాధారణ సమస్యల నుండి ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం కష్టమవడం, అలసట, చిన్న చిన్న పనులకే ఆయాసపడటం, నీరసపడడం, చేసే పనుల పట్ల ఆసక్తి, ఏకాగ్రత లేకపోవడం, నాలుక నొప్పి, చర్మం, గోళ్లు, నాలుక, కింది కనురెప్ప లోపలి వైపు పాలిపోవడం, జుట్టు బిరుసుగా అయిపోవడం, పాదాలలో నీరు చేరడం, అసాధారణ గర్భాశయ రక్తస్రావం, ఋతు చక్రంలో అసమానతలు రావడం వంటి తీవ్ర సమస్యలూ కలగవచ్చు.

నివారణా చర్యలు ఏమిటి?
పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా బాధిస్తుంటే వెంటనే వైద్య సంప్రదించి తగు పరీక్షలు చేయించుకొని, కారకాలు గుర్తించి, ఆ మేరకు చికిత్స పొందాలి. ఆహారపు అలవాట్లను ఆరోగ్యవంతంగా చేసుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డకు పాలిచ్చే సమయాల్లో పౌష్ఠిక, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరు రోజు వారి ఆహారంలో అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలను తీసుకుంటూ ఉండాలి. మాంసాహారాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత బారిన పడకుండా ఉండవచ్చు. ఇందులో ఐరన్‌, విటమిన్‌ బి 12, జింక్‌, ఫాస్పరస్‌ లు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్‌ సి అధికంగా ఉండే ఉసిరి, సిట్రస్‌ పండ్లు, ఆరెంజ్‌, స్ట్రాబెర్రీ, టమోటలను తీసుకోవాలి. ఖర్జూరం, బెల్లం, నల్ల నువ్వులు, తేనె, బాదం, జీడిపప్పు వంటివి నిత్యాహారంలో ఇముడ్చుకుంటే ఈ సమస్యను కొంత అదుపులో పెట్టవచ్చు.

నివారణే ఉత్తమ మార్గం
రక్తహీనత సమస్య గల వారు ఎప్పటికప్పుడు శరీరంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య, హిమోగ్లోబిన్‌ స్థాయి, పూర్తి రక్త గణన, రెటిక్యులోసైట్‌ కౌంట్‌ వంటి పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, రక్తస్రావం అధికంగా అయ్యే స్త్రీలు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సలహామేరకు తగు జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. ఏది ఏమైనా రక్తహీనతకు నివారణ ఒక్కటే ఉత్తమమైన మార్గం అనేది గుర్తించి తగిన జాగ్రత్తలు పాటించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -