సిగ్గూ ఎగ్గూలేని వాళ్లు కొందరుంటారు. ఎవరేమనుకున్నా, ఛీ కొడుతున్నా వాళ్లు చేస్తున్న పని మానుకోరు. కనీసం సరిచేసుకోరు. వాళ్లని మూర్ఖులు అంటారు. అంటే మాత్రం ఏముంది? ఉమ్మేసినా దులుపుకుని పోయే రకం కదా! ఇంకొందరు క్రూరులు, ఉన్మాదులుంటారు. ఇది మరీ డేంజరస్. మానవత్వానికి బద్ధ విరోధులు. ఈరెండు రకాలవాళ్లూ ఊరకనే పుట్టుకురారు. స్వార్థం, ఆధిపత్యం దాని అంత:సుత్రాలు. ఆధిపత్యానికీ ఆర్థిక అజామాయిషే కారణంగా ఉంటుంది. అది వేరేకథ. మానవ సమూహాలలో ఇలాంటి ఆధిపత్య అహంకార పూరితమైన ప్రవర్తనలు ఒళ్లు జలధరించేలా ఉంటాయి. ప్రపంచాన్ని ఒక వేదికగా తీసుకున్నప్పుడు ఆధిపత్యపు అగ్రదేశపు అహంకార పూరిత అఘాయిత్యాలను మనం చూడవచ్చు. ఇక కుటుంబం వేదికయితే ఇక్కడా అలాంటి పెత్తనమే కనపడుతుంది. అక్కడ ఘర్షణ యుద్ధానికి, విధ్వంసానికి దారితీస్తే, ఇక్కడ తగాదాగా బహిర్గతమవుతుంది. అందుకనే పెట్టుబడిదారీ సమాజపు అత్యున్నత దశ సామ్రాజ్యవాదంగా బయటపడుతుంది. అప్పుడు సామ్రాజ్యవాదం ఎక్కడ ఉంటే అక్కడల్లా యుద్ధం, మానవహననం జరుగుతూనే ఉంటాయి. ఇది సిద్ధాంతకర్తలూ చెప్పారు. చరిత్ర పొడవునా రుజువవుతూనే ఉంది.
విచిత్రమైన విషయమేమంటే ఈనాడు ప్రపంచంలో అగ్రరాజ్యంగా, ఆధిపత్యం చెలాయిస్తున్న సామ్రాజ్య వాద దేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రపంచంలో ఏడు యుద్ధాలను ఆపాననీ, ప్రపంచ నోబుల్ శాంతి బహుమతికి పూర్తిగా అర్హత నాకు ఉందనీ చెబుతున్నాడు.
ట్రంప్ అండతోనే గాజాలో నిత్యం రక్తం పారిస్తున్న ఇజ్రాయిల్ నేత నెతన్యాహుయే ట్రంప్‌కు శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం ఒక విరోదాభాస. పులులకు తోడేళ్ల కితాబులాగ. ఈ రోజుకు కూడా ఇజ్రాయిల్ పాలస్తీనా గాజాలో నిత్యం ప్రజలను చంపుతూ ఏకపక్షంగా దాడులు చేస్తున్న విషయం అమెరికా కనుసన్నలలోనే జరుగుతుంటే, ట్రంప్ శాంతి కాముకునిగా ఫోజులు పెట్టడం ప్రపంచ విడ్డూరం కాదా! ఎవరేమి అసహ్యించుకుంటే ఏమిటి? ఎందరు ముక్కున వేలేసుకుంటే వీళ్లకేమిటి! గత రెండేండ్లుగా బాంబులేస్తూ పసిపిల్లలను, మహిళలను నిర్ధాక్షణ్యంగా ఇజ్రాయిల్ చంపుతుంటే, గాజాలో ఆకలితో అనారోగ్యంతో కేకలు పెడుతున్న జనానికి సహాయం చేసే బృందాలపైనా బాంబులేసి నిరోధించడాన్ని, అమాన వీయంగా సమర్థిస్తున్న అమెరికా, శాంతి వచనాలు పలకడాన్ని బుద్ధిగా వీక్షిస్తున్న దేశాలనూ, వాటి అధినాయకులనూ ఛీకొట్టి , దోషులుగా నిలబెట్టటం తప్ప ఏం చేయగలం!
కొద్దిగయినా సిగ్గుండాలి కదా! తనకుతాను తడిమి చూసుకోవాలి కదా… మొన్న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇజ్రాయిల్ నేత ప్రసంగిస్తుండగా, బహిష్కరిస్తూ అనేక దేశాలు, అమెరికా మిత్ర దేశాలు సైతం వాకౌట్ చేస్తూ బయటకు వెళ్లిపోయాయి. నిరసన తెలియజేశాయి. అయినా నిస్సిగ్గుగా నెతన్యాహూ విషం కక్కుతూ మాట్లాడుతూనే ఉండటం మనం చూడవచ్చు. కానీ సభలో ఉన్న భారతదేశం మాత్రం ఏమీ స్పందించకపోవడం దారుణమైన విషయం. మనం చూస్తుండగానే గాజాలో అరవై ఐదు వేలకు పైగా ప్రజలను ఇజ్రాయిల్ సైన్యం చంపేసింది. ఆకలిబాధలు తీవ్రతరమయ్యాయి. అందుకనే ఐక్యరాజ్యసమితి ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నది. పాలస్తీనా దేశమే లేకుండా చేయాలన్న నియంతలు వీధిరౌడీల్లా బెదిరింపులకు దిగుతున్నారు. బ్రిటన్,ఫ్రాన్స్, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, అరబ్, లాటిన్ అమెరికా దేశాలు, ఇటలీ, మొదలైన దేశాలలో పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలు చేశారు. మద్దతుగా నిలిచారు. అంతెందుకు ఇజ్రాయిల్‌లో, అమెరికాలోనూ జనం, వీరి దుశ్చర్యలను ఖండిస్తూ నినదించారు. అయినా వాళ్లు ఖాతర చేయరు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నామని ఇప్పటికీ నూట యాభై దేశాలు ప్రకటించాయి. పాలస్తీనాలో జరుగుతున్న విధ్వంసాన్ని నరమేధాన్ని చూస్తున్న ప్రతిదేశమూ, ప్రజలూ స్పందిస్తున్నారు.
కానీ ఇంత అమానవీయ దుశ్చర్య కొనసాగుతుంటే ఏమీ పట్టనట్టు మన ప్రధాని మోడీ వ్యవహరించడం అత్యంత దారుణమైన విషయం. కనీస నైతికత, మానవత లేనివారే మోడీలా పూర్తిమౌనం వహిస్తారని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ విమర్శించారు. పాలస్తీనాకు మద్దతుగా భారత్ తన చారిత్రక కర్తవ్యాన్ని, నాయకత్వ పాత్రను పోషించాలని కోరారు. యు.ఎన్. సెక్రటరీ జనరల్ కూడా ఇజ్రాయిల్ దమనకాండను ఖండించి, వెంటనే దాడులు ఆపాలని కోరారు. ఎవరేమి కోరిననేమి! మానవ హంతకులకు హృదయమెక్కడ ఉంటుంది. వారి ఆది óపత్యాన్ని, నియంతృత్వాన్ని నిలువరించేది ప్రజాచైతన్యమొక్కటే. విధ్వంసానికి బలి అవుతున్న బాధితుల పక్షాన నిలబడటం మన కర్తవ్యం.
నిస్సిగ్గు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES