హైదరాబాద్ : సీనియర్ పేసర్ మహ్మద్ షమిని వదులుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగిన మహ్మద్ షమి ఆశించిన ప్రదర్శన చేయలేదు. తొమ్మది మ్యాచుల్లో ఆరు వికెట్లే పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున గొప్పగా రాణించిన షమి.. అదే ప్రదర్శన సన్‌రైజర్స్‌కు పునరావతం చేయటంలో విఫలమయ్యాడు. రూ.10 కోట్లతో వేలంలో షమిని దక్కించుకున్న సన్‌రైజర్స్ వచ్చే సీజన్‌కు అతడిని వేలంలోకి వదిలేసేందుకు ఆలోచన చేసింది. ఇదే సమయంలో లక్నో సూపర్‌జెయింట్స్ షమి కోసం సంప్రదింపులు చేయటంతో రూ.10 కోట్ల నగదు డీల్‌కు సన్‌రైజర్స్ సమ్మతించినట్టు సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన షమి.. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడుతున్నా.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌లో భరత్ అరుణ్‌తో కలిసి షమి పేస్‌కు పదును పెట్టనున్నాడు.



