Monday, April 6, 2026
E-PAPER
Homeఆటలుషమి సూపర్‌ షో

షమి సూపర్‌ షో

- Advertisement -

– బంతితో నిప్పులు చెరిగిన పేసర్‌
– ఛేదనలో రిషబ్‌ పంత్‌ అజేయ అర్థ సెంచరీ
-స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో సన్‌రైజర్స్‌కు నిరాశే
5 వికెట్ల తేడాతో సూపర్‌జెయింట్స్‌ గెలుపు


భీకర ఫామ్‌లో బ్యాటర్లు. సమిష్టిగా బౌలింగ్‌ బృందం ప్రదర్శన. అచ్చొచ్చిన ఉప్పల్‌ స్టేడియంలో ఊచకోత ఆశించిన అభిమానులకు భంగపాటు తప్పలేదు. షమి (2/9) నిప్పులు చెరగటంతో పవర్‌ప్లేలోనే బ్యాటింగ్‌ పస తగ్గగా.. క్లాసెన్‌, నితీశ్‌ అర్థ సెంచరీలతో సన్‌రైజర్స్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో రిషబ్‌ పంత్‌ (68 నాటౌట్‌, 50 బంతుల్లో 9 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో లక్నో సూపర్‌జెయింట్స్‌కు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. సన్‌రైజర్స్‌కు ఇది రెండో ఓటమి కాగా, సూపర్‌జెయింట్స్‌కు ఇదే తొలి విజయం.

నవతెలంగాణ-హైదరాబాద్‌

రిషబ్‌ పంత్‌ (68 నాటౌట్‌, 50 బంతుల్లో 9 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో సహచర బ్యాటర్లు నిరాశపరచగా.. జోరుమీదున్న సన్‌రైజర్స్‌ బౌలర్ల ఉత్సాహంపై పంత్‌ నీళ్లు చల్లాడు. అనవసర దూకుడుకు వెళ్లకుండా, లక్నో సూపర్‌జెయింట్స్‌ను లక్ష్యానికి చేరువ చేశాడు. 157 పరుగుల లక్ష్యాన్ని సూపర్‌జెయింట్స్‌ 5 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. సూపర్‌జెయింట్స్‌ ఓపెనర్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ (45, 27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (62, 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (56, 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. అభిషేక్‌ శర్మ (0), ట్రావిశ్‌ హెడ్‌ (7), ఇషాన్‌ కిషన్‌ (1), లివింగ్‌స్టోన్‌, అనికెత్‌ వర్మ (2) నిరాశపరిచారు. సూపర్‌జెయింట్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమి (2/9) నిప్పులు చెరిగే బంతులతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దూకుడుకు ముకుతాడు వేశాడు.

పంత్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌
లక్ష్యం 157 పరుగులు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో సూపర్‌జెయింట్స్‌ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. ఓపెనర్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ (45, 27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పవర్‌ప్లేలో మెరవటంతో సన్‌రైజర్స్‌ శిబిరం డీలా పడింది. మిచెల్‌ మార్ష్‌ (14), మార్‌క్రామ్‌, ఆయుశ్‌ బదొని (12), నికోలస్‌ పూరన్‌ (1) వికెట్లతో పుంజుకున్న సన్‌రైజర్స్‌.. సూపర్‌జెయింట్స్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ సమయంలో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (68 నాటౌట్‌) ఓ ఎండ్‌లో నిలబడ్డాడు. ఆచితూచి ఆడిన పంత్‌..6 ఫోర్లతో 43 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ పెద్దగా లేకపోవటంతో పంత్‌ రిస్క్‌ తీసుకోలేదు. ఒక్కో పరుగు జోడిస్తూ సూపర్‌జెయింట్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. అబ్దుల్‌ సమద్‌ (16, 12 బంతుల్లో 2 ఫోర్లు) నిష్క్రమణతో ముకుల్‌ చౌదరి (2 నాటౌట్‌) స్ట్రయిక్‌ రొటేట్‌ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆఖరు ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. పంత్‌ మూడు బౌండరీలతో లాంఛనం ముగించాడు. 19.5 ఓవర్లలో 5 వికెట్లకు సూపర్‌జెయింట్స్‌ 160 పరుగులు చేసింది. ఒక్క బంతి ఉండగానే సన్‌రైజర్స్‌పై గెలుపొందింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో హర్ష్‌ దూబె (2/18), ఈషన్‌ మలింగ (1/30), శివాంగ్‌ కుమార్‌ (1/30) రాణించారు.

టాప్‌-4 విఫలం
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను లక్నో పేసర్‌ మహ్మద్‌ షమి (2/9) కోలుకోలేని దెబ్బతీశాడు. అవుట్‌సైడ్‌ లెగ్‌ లెంగ్త్‌తో బంతులేసిన షమి.. తొలి ఓవర్లోనే అభిషేక్‌ శర్మ (0)ను అవుట్‌ చేశాడు. ట్రావిశ్‌ హెడ్‌ (7)ను తర్వాతి ఓవర్లో సాగనంపాడు. ప్రిన్స్‌ యాదవ్‌ అద్భుత బంతికి ఇషాన్‌ కిషన్‌ (1) వికెట్‌ కోల్పోయాడు. దీంతో 3.3 ఓవర్లలో 11 పరుగులకే సన్‌రైజర్స్‌ టాప్‌-3 వికెట్లు కోల్పోయింది. ఓ సిక్సర్‌తో ఆశలు రేపిన లియాం లివింగ్‌స్టోన్‌ (14) స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించి పంత్‌ చేతికి చిక్కాడు. 26/4తో సన్‌రైజర్స్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. పవర్‌ప్లేలో 22 పరుగులే చేసిన సన్‌రైజర్స్‌.. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో 50 పరుగుల మార్క్‌ దాటింది. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ వంద పరుగులు చేసినా గొప్పే అనిపించింది.

క్లాసెన్‌, నితీశ్‌ మెరుపుల్‌
హెన్రిచ్‌ క్లాసెన్‌ (62), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (56) ఐదో వికెట్‌కు 63 బంతుల్లో 116 పరుగులు జోడించారు. నితీశ్‌, క్లాసెన్‌ నెమ్మదిగా పరుగుల వేట మొదలెట్టినా.. మిడిల్‌ ఓవర్లలో దంచికొట్టారు. ఈ ఇద్దరు మెరవటంతో మిడిల్‌ ఓవర్లలో సన్‌రైజర్స్‌ ఏకంగా 101 పరుగులు పిండుకుంది. క్లాసెన్‌ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. నితీశ్‌ కుమార్‌ 3 ఫోర్లు 4 సిక్సర్లతో 30 బంతుల్లో అర్థ సెంచరీ అందుకున్నాడు. క్లాసెన్‌, నితీశ్‌ క్రీజులో నిలువగా.. డెత్‌ ఓవర్లలో సన్‌రైజర్స్‌ ధనాధన్‌పై కన్నేసింది. కానీ ఆఖరు 4 ఓవర్లలో మళ్లీ వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ 156 పరుగులకే పరిమితమైంది. అనికెత్‌ వర్మ (2 నాటౌట్‌, 5 బంతుల్లో), హర్ష్‌ దూబె (0), శివాంగ్‌ కుమార్‌ (5, 4 బంతుల్లో 1 ఫోర్‌), హర్షల్‌ పటేల్‌ (4) ఆఖర్లో పట్టు వదిలారు. 20 ఓవర్లలో 9 ఓవర్లలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 156 పరుగులు చేసింది. సూపర్‌జెయింట్స్‌ బౌలర్లలో మహ్మద్‌ షమి (2/9), ప్రిన్స్‌ యాదవ్‌ (2/34), అవేశ్‌ ఖాన్‌ (2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. పవర్‌ప్లేలో అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచిన మహ్మద్‌ షమి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ : ట్రావిశ్‌ హెడ్‌ (సి) మార్‌క్రామ్‌ (బి) షమి 7, అభిషేక్‌ శర్మ (సి) సిద్దార్థ్‌ (బి) షమి 0, ఇషాన్‌ కిషన్‌ (బి) ప్రిన్స్‌ యాదవ్‌ 1, లియాం లివింగ్‌స్టోన్‌ (సి) పంత్‌ (బి) రాథి 14, హెన్రిచ్‌ క్లాసెన్‌ (సి) పంత్‌ (భి) అవేశ్‌ ఖాన్‌ 62, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) ప్రిన్స్‌ యాదవ్‌ (బి) సిద్దార్థ్‌ 56, అనికెత్‌ వర్మ నాటౌట్‌ 2, హర్ష్‌ దూబె (బి) అవేశ్‌ ఖాన్‌ 0, శివాంగ్‌ కుమార్‌ (బి) ప్రిన్స్‌ యాదవ్‌ 5, హర్షల్‌ పటేల్‌ (రనౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 156.
వికెట్ల పతనం : 1-1, 2-8, 3-11, 4-26, 5-142, 6-144, 7-144, 8-151, 9-156.
బౌలింగ్‌ : మహ్మద్‌ షమి 4-0-9-2, దిగ్వేశ్‌ రాథి 4-0-46-1, ప్రిన్స్‌ యాదవ్‌ 4-0-34-2, సిద్ధార్థ్‌ 4-0-29-1, అవేశ్‌ ఖాన్‌ 4-0-36-2.
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ : మార్‌క్రామ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) శివాంగ్‌ 45, మిచెల్‌ మార్ష్‌ (సి) నితీశ్‌ (బి) మలింగ 14, రిషబ్‌ పంత్‌ నాటౌట్‌ 68, ఆయుశ్‌ బదొని (స్టంప్డ్‌) కిషన్‌ (బి) దూబె 12, నికోలస్‌ పూరన్‌ (రనౌట్‌) 1, అబ్దుల్‌ సమద్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) దూబె 16, ముకుల్‌ చౌదరి నాటౌట్‌ 2, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 160.
వికెట్ల పతనం : 1-37, 2-77, 3-102, 4-105, 5-139.
బౌలింగ్‌ : హర్ష్‌ దూబె 4-0-18-2, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1-0-14-0, జైదేవ్‌ ఉనద్కత్‌ 3.5-0-50-0, ఈషన్‌ మలింగ 4-0-30-1, హర్షల్‌ పటేల్‌ 3-0-16-0, శివాంగ్‌ కుమార్‌ 4-0-30-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -