Saturday, February 21, 2026
E-PAPER
Homeజాతీయంఅమ్మకానికి రైల్వే సంస్థల వాటాలు

అమ్మకానికి రైల్వే సంస్థల వాటాలు

- Advertisement -

వచ్చే నాలుగేండ్ల్లలో 20 శాతం వాటాలు ప్రయివేటుకు..
రూ.80 వేల కోట్ల విలువ..మోడీ సర్కార్‌ బడా స్కెచ్‌

న్యూఢిల్లీ : రైల్వే రంగాన్ని ఆధునీకరిస్తామన్న సాకుతో లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా వాటాలను విక్రయించడానికి మోడీ సర్కార్‌ స్కెచ్‌ వేసింది. వచ్చే నాలుగేళ్లలో ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సి వంటి ఏడు కీలక రైల్వే సంస్థల నుండి వేల కోట్లు పిండుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివిధ రైల్వే సంస్థల్లోని రూ.80,000 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయ ప్రతిపాదనలకు వీలుగా ఇటీవల క్యాబినెట్‌ సెక్రటరీ నేతృత్వంలోని కోర్‌ గ్రూప్‌ ఆఫ్‌ సెక్రటరీస్‌ సమావేశంలో చర్చించారు. భారత రైల్వే రంగాన్ని మరింత ఆధునీకరణ పేరుతో 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి 2029-30 నాటికి రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏడు ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్రానికి ఉన్న వాటాలను విడతల వారీగా విక్రయించడం ద్వారా సుమారు రూ.80,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఏడు సంస్థల్లోని వాటాలకు కత్తెర..
ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌
ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌
రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌
ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌
రైల్‌ టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా
రైట్స్‌ లిమిటెడ్‌
కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా
పై రైల్వే సంస్థలలో ప్రభుత్వం తన వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఒఎఫ్‌ఎస్‌) పద్ధతిలో మార్కెట్‌ శక్తులకు విక్రయించనుంది. ప్రస్తుతం ఈ ఏడు సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ సుమారు రూ.3.5 లక్షల కోట్లుగా ఉం డగా.. ఇందులో సుమారు రూ.80వేల కోట్ల పైగా విలువ చేసే 20 శాతం వాటాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. యాజమాన్య నియంత్రణను కోల్పోకుండా కనీసం 51 శాతం వాటాను ప్రభుత్వం తన వద్దే ఉంచుకోనున్నట్లు పాలకవర్గాలు లీకులు ఇవ్వడం గమనార్హం.

ఎన్‌ఎంపి 2.0 షురూ..
నేషనల్‌ మోనటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి2.0)లో భాగంగా చేపట్టనున్న ఈ వాటాల విక్రయాల ద్వారా వచ్చే నిధులను వందే భారత్‌ రైళ్లు, హైస్పీడ్‌ కారిడార్లు, 1,300 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కేటాయించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యూహాత్మక నిర్ణయం వల్ల ప్రభుత్వానికి పన్నుల భారం లేకుండా అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ను పెంచడానికి కూడా దోహదపడుతుందని తెలిపాయి. ఈ చర్య స్టాక్‌ మార్కెట్లో రైల్వే షేర్లకు మరింత డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.. కాగా.. లాభాల్లోని దేశ ఆస్తులను అమ్మకానికి పెట్టడం ద్వారా తాత్కాలికంగా నిధులు సమకూర్చుకోవాలని చూడటం ప్రభుత్వ ఆర్థిక వైఫల్యానికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -