లక్కోజు జయ మాధురి… నాట్యమంటే ఆమెకు ప్రాణం. కూచిపూడినే తన శ్వాసగా మలచుకున్నారు. తండ్రి మరణించిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తల్లి ప్రోత్సాహంతో ఉన్నత చదువులు పూర్తి చేయడంతో పాటు తనకు ఇష్టమైన కూచిపూడిలో అడుగుపెట్టారు. వేలాది ప్రదర్శనలు ఇస్తున్నారు. ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. తనకు తెలిసిన విద్యను పదిమందికి నేర్పించాలనే సంకల్పంతో ‘జయ కూచిపూడి కళాక్షేత్రం’ ఏర్పాటు చేసి ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
భద్రాచలంలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జయ మాధురి బాల్యం నుంచే నాట్యంపై మక్కువ పెంచుకున్నారు. కష్టాలను సైతం నవ్వుతూ ఎదుర్కొని, నేడు వందలాది మందికి కూచిపూడి విద్యను నేర్పిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
గురువుల ఆశీస్సులు.. తల్లి అండ..
జయ మాధురి తన చిన్నతనంలోనే ప్రముఖ నాట్య గురువులు వరలక్ష్మి, కొండలరావు, ఉదయశ్రీల వద్ద కూచిపూడిలో చక్కటి శిక్షణ తీసుకున్నారు. అయితే విధి వక్రించి చిన్న వయసులోనే ఆమె తండ్రి మరణించాడు. ఆ సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆ క్లిష్ట సమయంలో తల్లి గీతా రాజ్యలక్ష్మి గుండె నిబ్బరంతో ముందుకు సాగారు. కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. ఎంతో కష్టపడి పట్టుదలతో కొడుకు రామకృష్ణ, కూతురు జయ మాధురిలను ఉన్నత చదువులు చదివించారు. చదివించడంతోనే తన బాధ్యత తీరిపోయిందనుకోలేదు. పిల్లలు ఎంచుకున్న కళా రంగాల్లో రాణించేలా వారి వెన్నంటి నిలిచారు. తల్లి అండ, గురువుల శిక్షణతో 2008లో జయ మాధురి తన కూచిపూడి అరంగేట్రం చేశారు.
ముక్కోటి ఉత్సవాల్లో ఆమె నాట్యం ఉండాల్సిందే..
అరంగేట్రం అనంతరం జయ మాధురి వెనుతిరిగి చూసుకోలేదు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. కళాభిమానుల మన్ననలు పొందారు. ముఖ్యంగా భద్రాచలం రామాలయంలో జరిగే ప్రతి ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) ఉత్సవాల్లో జయ మాధురి నాట్య ప్రదర్శన ఉండాల్సిందే అనేంతగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు వరంగల్ వేయిస్తంభాల గుడి, స్వర్ణగిరి, శ్రీశైలం వంటి ప్రముఖ దేవాలయాల్లో ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శిరిడీలోనూ తన అద్భుత నాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
జయ కూచిపూడి కళాక్షేత్రం
కేవలం తాను ఎదగడమే కాకుండా, తన కళను నలుగురికీ పంచాలని నిర్ణయించుకున్నారామె. ఆ ఉద్దేశంతో 2019లో ‘జయ కూచిపూడి కళాక్షేత్రం’ను స్థాపించారు. భద్రాచలం, అశ్వపురంలో రెండు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. స్థానిక చిన్నారులకు, కళాకారులకు కూచిపూడి శిక్షణ ఇస్తూ కళారంగానికి అద్భుతమైన కృషి చేస్తున్నారు. ఆమె ప్రతిభకు గుర్తుగా పలు అవార్డులు, రివార్డులు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నుంచి ప్రశంసలు అందుకోవడం ఆమె నాట్య ప్రస్థానంలో ఒక మైలురాయి. అలాగే, ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు సైతం జయ మాధురి నాట్య కౌశలాన్ని మెచ్చుకున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, కూచిపూడి కళకు వన్నె తెస్తున్న ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
– తల్లాడ సాయికృష్ణ



