– మళ్లీ వర్షాలతో రైతుల్లో హర్షం
– దెబ్బతిన్న మొక్కల స్థానంలో మరోమారు విత్తనాలు
– ఇతర పంటలకూ అదునయ్యేలా వర్షపాతం
– రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో సంతోషం నెలకొంది. గతనెల రాష్ట్రంలో అనేకచోట్ల చెదురుమదురు వానలే కురవడంతో గింజలు విత్తుకునేంత పదును లేక మొలకలు రాలేదు. అక్కడక్కడ వచ్చిన మొలకలు కూడా అధిక ఉష్ణోగ్రతలకు వడలి పోయాయి. జూన్ 29 నుంచి రుతుపవనాల ప్రభావంతో పత్తి, ఇతర పంటలకూ అదునయ్యేలా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతనెల సగటున 30 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదయింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కాస్త కుడిఎడుమ ఇంతే మొత్తంలో వర్షాలు కురిశాయి. కనీసం సగటున 60 మి.మీ వర్షం కురిస్తే గానీ పత్తి విత్తనాలు మొలకెత్తవు. కానీ దానిలో సగం వర్షపాతం మాత్రమే నమోదవడటంతో బావుల కింద మినహా మిగిలిన చోట్ల విత్తనాలు దెబ్బతిన్నాయి. 40శాతం గింజలు కూడా మొలకెత్తకపోవడంతో దుక్కులు చెడగొట్టారు. తద్వారా ఒక్కో రైతు ఎకరానికి రూ.8వేలకు పైగా నష్టపోయాడు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు భూమి పదునెక్కుతోంది. అప్పడు గింజలు మొలకెత్తని చోట మరోసారి నాటేందుకు రైతాంగం సిద్ధమవుతోంది. పత్తికే కాదు ఇతర పంటలకు కూడా జీవం పోసేలా వానలు కురుస్తుం డటంతో రైతుల్లో సంతోషం వెల్లువిరుస్తోంది.
దెబ్బతిన్న చోట మళ్లీ విత్తేందుకు సిద్ధం
సరైన పదును లేక విత్తనాలు మొలకెత్తని చోట మళ్లీ గింజలు నాటేందుకు రైతాంగం సిద్ధమవు తోంది. తెలంగాణలో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవ సాయశాఖ అంచనా. దీనిలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని లెక్కలు వేశారు. ఖమ్మం జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 2.13 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కొత్తగూడెం జిల్లాలో 2.14 లక్షల ఎకరాలకు గాను దాదాపు రెండు లక్షల ఎకరాల్లో గింజలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఎకరాలకు గాను 45 లక్షల ఎకరాలకు పైగా నాటినా కనీసం 15 లక్షల ఎకరాల్లో విత్తనాలు సరైన పదును లేక దెబ్బతిన్నాయి.
ఆశాజనకంగా వానలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడురోజులుగా ఆశాజనకంగా వానలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో జూన్ 29వ తేదీన సగటున 31.6 మి.మీ, 30న 30.8 మి.మీ, జులై 1న 22.7 మి.మీ వర్షపాతం నమోదైంది. మూడురోజులుగా జిల్లా మొత్తమ్మీద 60 మి.మీ వర్షం నమోదైంది. ఈ వర్షాలతో విత్తనాలకు సరైన తేమశాతం సమకూరనుంది. ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా పత్తి విత్తనాలు నాటారు. వీటిలో 40శాతం మేర విత్తనాలు మొలకెత్తలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 4.82 లక్షల చొప్పున విత్తనాలు అవసరం కాగా ఈమేరకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దెబ్బతిన్న విత్తనాల స్థానంలో నాటేందుకు అవసరమైన విత్తనాలు కూడా లభిస్తున్నాయి. గతేడాది 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ రూ.864 ఉంటే ఈ ఏడాది రూ.37 పెరిగి రూ.901కి చేరింది. ఎకరాకి రెండు ప్యాకెట్లకు రూ.1,802 చొప్పున విత్తనాలకు వెచ్చించారు. ఇప్పుడు చావు గింజలకు మరో రూ.901 వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ గింజలు అధిక మొత్తంలో మొలకెత్తకపోతే మొత్తం దుక్కిని చెడగొట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే ఒక ఫ్లవ్ ఖర్చు రూ.3,000 మినహా మిగిలిన అన్ని పెట్టుబడులు మళ్లీ వెచ్చించక తప్పదు. కాబట్టి రైతుపై రూ.8వేల అదనపు భారం పడుతుంది.
జులై 20 వరకు పత్తి విత్తనాలు నాటొచ్చు
పత్తి విత్తనాలను జులై 20వ తేదీ వరకు విత్తుకోవచ్చు. ఈ ఏడాది చాలా మంది రైతులు ఒకటి, రెండు తేలికపాటి వర్షాలు పడగానే నాటారు. కొంత మేర విత్తనాలు మొలకెత్తక నష్టపోయారు. కనీసం 60 మి.మీ వర్షపాతం నమోదైతేనే నాటాలని సూచించినా ఎక్కడ వెనుకబడి పోతామోనని చాలా మంది రైతులు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు కావాల్సిన వర్షం కరుస్తుంది కాబట్టి నేలకు అనువైన బీటీ విత్తన రకాలను ఎంచుకొని నాటాలి. నేల స్వభావం ఆధారంగా 40 నుంచి 42 అంగుళాల అచ్చువేసుకొని విత్తితే మంచి దిగుబడి వస్తుంది. తేలిక నేలల్లోనైతే అధిక సాంద్రత పద్ధతిలో 36-6 అంగుళాల దూరంలో లేదా దగ్గరగా సాగు చేసే పద్ధతి అయితే 32.12 అంగుళాల దూరంలో విత్తనాలు వేసుకోవాలి. అనువైన వంగడాలను ఎంచుకుంటే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. రెండో పంట కూడా సాగు చేయొచ్చు. పత్తి గింజలు నాటాక 48 గంటల్లో తేమ ఉంటే పెండి మిథాలిన్ 1.2 లీటర్లను ఎకరా చొప్పున పిచికారీ చేస్తే కలుపు ఉధృతి తగ్గుతుంది.
– సరిత, ఏడీఏ, కూసుమంచి