రౌడా ఆల్సెర్కల్… నాలుగేండ్ల వయసులోనే చెస్ ఆటలోకి అడుగుపెట్టింది. టీనేజ్ జీవితాన్ని ప్రపంచ పోటీకి అంకితం చేస్తోంది. గత నవంబర్‌లో అరబ్ ఉమెన్స్ చెస్ ఛాంపియన్‌షిప్ ఎనిమిదవ రౌండ్‌లో అబుదాబికి ఈ చెందిన ఈ యువ క్రీడాకారిణి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా ఘనత సాధించింది. అంతేనే తన దేశంలోనే కాదు మొత్తం గల్ఫ్ ప్రాంతం నుండి ఈ విజయం సాధించిన మొదటి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 15 ఏండ్ల వయసులోనే చెస్ చరిత్రలే చెరగని ముద్ర వేసుకుంది. మరీ ముఖ్యంగా పరదాలు దాటి పురుషుల ఆధిపత్యంగా చెలామణి అవుతున్న క్రీడలో మహిళల అవకాశాలకు చిహ్నంగా నిలిచిన ఆమెతో సంభాషణ మానవి పాఠకుల ప్రత్యేకం…
నాలుగేండ్లకే చెస్ ఆడటం ప్రారంభించారు. చిన్న వయసు కావడంతో చెస్ క్లబ్ మిమ్మల్ని మొదట తిరస్కరించింది. ఆ క్షణం మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దింది?
నేను, మా అమ్మ, నాన్న, మా అక్కలు అందరం కలిసి ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవాళ్లం. నేను మా అమ్మతో ఎప్పుడూ ‘దయచేసి నన్ను చెస్ క్లబ్‌కు తీసుకెళ్లండి’ అంటూ బతిమలాడుతుండేదాన్ని. నా బాధ భరించలేక రెండు వారాల తర్వాత ఆమె ఈ చెస్ క్లబ్ గురించి తెలుసుకుంది. అక్కడ నన్ను చేర్చాలనుకుంది. కానీ వాళ్లు నన్ను ఒప్పుకో లేదు. ఎందుకంటే అందులో చేరాలంటే కనీసం ఆరేండ్లు ఉండాలి. మేము అక్కడి కోచ్‌లతో, మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాము. కానీ వాళ్లు అంగీకరించలేదు. అప్పుడు నా మొదటి కోచ్ అయిన హిషామ్ అల్-అర్ఘా ‘సరే, నేను ఆమెకు ఒక అవకాశం ఇస్తాను’ అన్నారు. నేను అతనితో ఆడటం మొదలుపెట్టాను. నేను నైట్‌ను కదిలించినప్పుడు ఆయన నన్ను ఏమీ అనలేదు. సాధారణంగా పిల్లలకు (నైట్) ముక్కను ఎలా కదిలించాలో నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైనది. అయితే నా కోచ్ నాకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు చాలా సంతోషించాను.
సీరియస్‌గా ఆడేందుకు ఎంత సమయం పట్టింది?
డిసెంబర్ 2013లో (అబుదాబి) చెస్ క్లబ్‌లో చేరాను. నా కోచ్ ఇతర అమ్మాయిలతో నన్ను ఆడించారు. మా చెస్ క్లబ్ తరఫున అమ్మాయిలను ఓడించాను. అది చూసి నా నాలుగేండ్ల వయసులో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆడటానికి అవకాశం ఇవ్వాలని క్లబ్ నిర్ణయించుకుంది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని పొందగలిగాను. ఆ తర్వాత రెండు నెలల తర్వాత నేను ఆసియా స్కూల్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆడాను. అక్కడ మొదటి స్థానంలో నిలిచాను.
ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్పగా ఆడతున్నారు. దీని కోసం విలువైనవి ఏమైనా కోల్పోయారా?
నేను నా పాఠశాలను కోల్పోవల్సి వచ్చింది. ఎందుకంటే స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లలేకపోయే దాన్ని. సరదాగా గడపడానికి, నా స్నేహితులతో బయటకు వెళ్లడానికి కూడా నాకు సమయం ఉండేదికాదు. ఎప్పుడూ ప్రయాణిస్తూ, శిక్షణ పొందుతూ, చెస్ ఆడుతూ ఉండేదాన్ని. కాబట్టి చాలా కుటుంబ కార్యక్రమా లను కూడా కోల్పోతున్నాను. అయితే నిత్యం ప్రయాణం చేస్తూ ఉండటం సరదాగా అనిపిస్తుం ది. కానీ అది కనిపించినంత సులభం కాదు. చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. నా ఐదేండ్ల వయసులో చెస్ క్లబ్, కుటుంబం, సమాఖ్య నుండి ఒత్తిడి ఎదుర్కోవలసి వచ్చింది. వారు నా నుండి చాలా ఆశించారు. కానీ నేను దాని గురిం చి ఎప్పుడూ బాధపడలేదు. నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను.
విద్యార్థిగా, క్రీడాకారిణిగా, మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా ఒకేసారి సమతుల్యం చేసుకోవడం ఎలా సాధ్యమైంది?
నాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. స్కూల్లో నేను వేరే వ్యక్తిని, చెస్‌లో మరో వ్యక్తిని. ఎప్పుడు సరదాగా గడపాలో నాకు తెలుసు. శిక్షణ ఎప్పుడు సీరియస్‌గా ఉంటుందో నాకు తెలుసు. అందుకే చాలా బ్యాలెన్స్‌గా ఉంచుకుంటాను. నేను టోర్నమెంట్‌లకు వెళ్లి గెలిచి తిరిగి స్కూల్‌కు వచ్చినప్పుడు ఏమీ జరగనట్లు నటిస్తాను. నా టీచర్లు నాతో ‘బాగుంది రౌడా! నీ అసైన్‌మెంట్ పెండింగ్ ఉంది’ అంటారు. నేనూ ఓ సాధారణ 16 ఏండ్ల అమ్మాయిలాగే ఉంటారు.
ఒక క్రీడాకారిణిగా మీ ఆలోచనా విధానం ఎలా ఉంటుంది?
నాకు వ్యూహాలు అంటే చాలా ఇష్టం. లెక్కలు వేయడం చాలా ఇష్టం. కానీ చెస్ అంటే అంతా బ్యాలెన్స్ గురించే ఆలోచించాలి. ఎప్పుడు దాడి చేయాలో, ఎప్పుడు డిఫెండ్ చేయాలో తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా ఇందులో నాకు నైపుణ్యం ఉంది అని నేను బలంగా నమ్ముతాను.
మీ శిక్షణా విధానం ఎలా ఉంటుంది?
పాఠశాల రోజుల్లో మూడు నుండి నాలుగు గంటలు శిక్షణ తీసుకుంటాను. సెలవుల్లో రోజంతా ఆడుతూనే ఉంటాను. కొంత సేపు విరామం తీసుకుంటాను. టోర్నమెంట్లు ఉన్నప్పుడు చెస్ క్లబ్‌లో శిక్షణ పొందుతాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెస్.కాంలో ఆడుతూనే ఉంటాను. నిత్యం నా ఆలోచనలన్నీ చెస్ చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆడే క్రమంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు?
నేను చెస్‌ను ప్రేమిస్తున్నాను. నేను ఆడుతుంది నాకోసమే అని నిత్యం గుర్తుపెట్టుకుంటాను. నేను వేరెవరికోసమే ఆడుతున్నట్టు భావిస్తే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.
పురుషులు ఆధిపత్యం చెలాయించే క్రీడలో యువతిగా ఎలా ఫీలవుతున్నారు?
యుఎఇ నుండి మొదటి మహిళా గ్రాండ్‌మాస్టర్ అయినందుకు ప్రజలు అభినందిస్తూ సోషల్ మీడియా పోస్ట్‌లు పెడుతు న్నారు. అయితే కొందరు నా గురించి, చెస్ గురించి కాకుండామిగతా వాటి గురించి మాట్లాడు తున్నారు. నేను ఈ ఆటలో నా శక్తి మేరకు పనిచేస్తున్నా ను. ఆ ప్రజలు దాన్ని చూడలేరు. నా రూపం, నేను హిజాబ్ ధరించకపోవడం గురించి మాట్లాడుతుంటారు. కానీ నేను వారి నుండి కోరుకుంటుంది ఇది కాదు. 16 ఏండ్ల వయసులో చాలా సాధించాను. నాకంటూ ఒక పేరు తెచ్చుకున్నాను. కానీ ప్రజలు తప్పుడు విషయాలపై దృష్టి పెడుతున్నారు. వాళ్లను ఆపడం కూడా అంత సులభం కాదు. నేను వాటి గురించి వదిలేసి చెస్‌పైనే దృష్టిపెడతాను.
యూఏఇలోని పిల్లలను, యువతులను చెస్ ఆడటంలో ప్రేరేపించగలుగుతున్నారా?
నేను మొదట చెస్ క్లబ్‌లో చేరినప్పుడు అమ్మాయిలు పెద్దగా లేరు. నేను గెలవడం ప్రారంభించిన తర్వాత చాలా మంది పిల్లలు వచ్చారు. చాలా మంది నన్ను చూసి ‘ఓV్‌ా, నువ్వు రౌడా కాదా.. నేను నీ గురించి చాలా విన్నాను. నిన్ను చూడాలనే కోరికతోనే మేము చెస్ క్లబ్‌లో చేరాము’ అనేవారు. అప్పుడు నాకు నిజంగా గర్వంగా ఉండేది. మనం మరిన్ని యూఏఇ ఆటగాళ్లను, యూఏఇ మహిళలను, మరింత ప్రతిభను, మరిన్ని టోర్నమెంట్‌లను చూడగలమని నేను నిజంగా ఆశిస్తున్నాను. ఆడుతున్న అమ్మాయిలను చాలా మంది గౌరవంగా చూస్తుండటం నాకు నిజంగా సంతోషంగా ఉంది. కానీ నేను చెప్పినట్లుగా కొన్నిసార్లు ఇది చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఎందుకంటే ఎవరూ పరిపూర్ణులు కారు. ప్రతి ఒక్కరికీ వారి లోపాలు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలి.
మీ భవిష్యత్ ప్రణాళిక
నేను మరిన్ని ప్రపంచ ఛాంపియన్ షిప్‌లను గెలవాలని ప్లాన్ చేస్తున్నాను. అక్టోబర్‌లో అల్బేనియాలో ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్ త్వరలో రానుంది. కనీసం మొదటి మూడు స్థానాల్లో నిలిచేందుకు చాలా కష్టపడుతున్నాను.
- సలీమ