ఇటీవల గోవాలో జరిగిన ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ 2025 పోటీల్లో 15 దేశాల నుంచి వచ్చిన 40 మంది యువతులతో జరిగిన పోటీలో అగ్రస్థానంలో నిలిచి చన్నగిరి నందిని కీరిటం దక్కించుకున్నారు. ‘కొంచెం హట్కే’ చిత్రంతో పాటు మరో చిత్రంలోనూ కథానాయికగా నందిని నటిస్తున్నారు. ఓ పక్క గ్లామర్ ప్రపంచంలో పోటీ పడుతూ, మరో పక్క వెండితెరపైనా మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నందిని సేవా కార్యక్రమాల్లోనూ ముందుడటం విశేషం. మిస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ కిరీటం అందుకున్న నేపథ్యంలో నందిని మాట్లాడుతూ, ‘విజయవాడ నుంచి ప్రపంచస్థాయి వరకు నేను వెళ్ళగలిగానంటే మా ఫ్యామిలీ చేసిన సపోర్టే కారణం. మిస్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ ఇండియా(2023), మిస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఇండియా (2024), మిస్ హైదరాబాద్, మిస్ సౌత్ ఇండియా (2022)తోపాటు బెస్ట్ వాక్, బెస్ట్ యాటిట్యూడ్, బెస్ట్ స్మైల్ వంటి విభాగాల్లోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్నాను. అలాగే సినిమాల్లో నటిగా రాణించాలనే ప్రయత్నంలోనూ ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నాను. వీటితోపాటు అమృతహస్తం ఛారిటబుల్ ట్రస్ట్, అన్నసంతర్పణ సమితి ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్‌గా పేద, బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సేవలు అందించాను. ఇకపై కూడా సేవా కార్యక్రమాలను మరింతగా చేస్తాను’ అని తెలిపారు.