Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంనడి సముద్రంలో నౌకలు..!

నడి సముద్రంలో నౌకలు..!

- Advertisement -

రేపటి నుంచి రష్యా చమురుపై ఆంక్షలు
సందిగ్ధంలో 77 లక్షల బ్యారెల్స్‌ చమురు
చమురు కంపెనీల్లోనూ ఆందోళన

న్యూఢిల్లీ : రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు జనవరి 21 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత్‌కు రావాల్సిన రష్యా చమురు సందిగ్దంలో పడింది. యూఎస్‌ ఆంక్షలతో సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. శుక్రవారంలోగా భారత తీరం చేరకపోతే ఆ నౌకల్లోని చమురు ఎటూ వెళ్లలేని స్థితిలో పడే ప్రమాదం కనిపిస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. రష్యాకు చెందిన బ్లాక్‌ లిస్టెడ్‌ సంస్థలు రాస్‌నెఫ్ట్‌, లుకాయిల్‌ నుంచి బయలుదేరిన నౌకలు భారత్‌ వైపు వస్తున్నాయి. కెప్లర్‌ డేటా ప్రకారం వీటిలో సుమారు 77 లక్షల బ్యారెళ్ల ముడి చమురు రవాణ అవుతోంది. అమెరికా ఆంక్షల గడువులోగా చమురు భారత్‌ చేరకపోతే ఆ చమురును ఇక్కడి నౌకాశ్రయాల్లో దించుతారా? లేదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. గడువు దగ్గర పడుతోంటే చమురు కంపెనీల్లోనూ ఆందోళన పెరిగింది.

సముద్రంలో ఉన్న ట్యాంకర్లలో ఎక్కువ భాగం రిలయన్స్‌ ఇండిస్టీస్‌ జామ్‌నగర్‌ రిఫైనరీకి, నయారా ఎనర్జీకి చెందిన వాడినార్‌ పోర్టుకు చేరాల్సి ఉంది. ఈ నౌకలు నవంబర్‌ చివరి వారంలో లేదా డిసెంబర్‌ మొదట్లో ఇక్కడకు చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గడువు ముగిసిన తర్వాత కూడా చమురు కొనేందుకు భారత కంపెనీలు అమెరికాను ఏమైనా మినహాయింపులు కోరాయా..? లేదా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల హంగేరీ దేశానికి రష్యా ఆయిల్‌ కొనుగోలు విషయంలో అమెరికా వెసులుబాటు కల్పించింది. లుకాయిల్‌ లావాదేవీలకు సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనడం మానేస్తామన్ని మోడీ సర్కార్‌ అంగీకారంతో భారత్‌లోని ఐదు సంస్థలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ దేశం నుంచి కొనుగోళ్లను నిలిపివేశాయి.

ఇందులో రిలయన్స్‌ వాటానే ఎక్కువ కావడం విశేషం. పూర్తిగా రష్యా సరఫరాలపై ఆధారపడ్డ నయారా సంస్థ మాత్రం ఇంకా కొనుగోలును కొనసాగిస్తోంది. ఈ ఆంక్షల కారణంగా నవంబర్‌ నెలలో రష్యా నుంచి భారతదేశానికి వచ్చే చమురు రవాణా ఇప్పటికే భారీగా పడిపోయింది. అక్టోబర్‌ నెలతో పోలిస్తే నవంబర్‌ 1-17 మధ్య దిగుమతులు మూడింట రెండు వంతులు లేదా 66 శాతానికి తగ్గాయి. దీంతో సరఫరాలో అంతరాయాన్ని తగ్గించుకోవడానికి భారతీయ రిఫైనరీలు అమెరికా, మధ్యప్రాచ్యం, ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతున్నాయి. ట్రంప్‌ ఆంక్షలకు భారత్‌ తలొగ్గి రష్యాకు చెందిన చౌక చమురును వదిలేసి.. ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తోందని తెలుస్తోంది. అదే జరిగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి వినియోగదారులపై మరింత భారం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -