Saturday, September 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్ర కొత్త డీజీపీ శివధర్‌రెడ్డి

రాష్ట్ర కొత్త డీజీపీ శివధర్‌రెడ్డి

- Advertisement -

అక్టోబర్‌ 1న బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీపీ)గా రాష్ట్ర నిఘా విభాగం డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. సాంకేతికంగా ఆయనకు పోలీస్‌కోఆర్డినేషన్‌, డీజీపీ (ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి శివధర్‌రెడ్డి ఉత్తర్వులను సచివాలయంలో అందుకున్నారు. ఆయనకు పోలీస్‌ శాఖలో అపార అనుభవంతో పాటు చిత్తశుద్ధి, నిజాయితీ, సమర్థుడైన ఐపీఎస్‌ అధికారిగా పేరున్నది. శివధర్‌రెడ్డి 1994లో ఐపీఎస్‌ సర్వీసుకు ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలిఖాన్‌ గ్రామంలో జన్మించిన శివధర్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఎల్‌ఎల్‌బీ వరకు విద్యాభ్యాసం చేశారు. కొంత కాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. తర్వాత సివిల్‌ సర్వీస్‌ పరీక్ష రాసిన శివధర్‌రెడ్డి ఐపీఎస్‌ అధికారిగా పోలీస్‌ శాఖకు ఎంపికయ్యారు. మొదట విశాఖ జిల్లా అనకాపల్లి, చింతపల్లి ఏఎస్పీగా పోలీసు శాఖలో విధులను ప్రారంభించిన ఆయన తర్వాత గ్రేహౌండ్స్‌ ఏఎస్పీగా, అనంతరం నెల్లూరు, గుంటూరు, నల్లగొండ, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ డీసీపీగా, దక్షిణ మండలం డీసీపీగా విధులను నిర్వహించి సమర్థుడైన అధికారిగా పేరు పొందారు.

ఆ తర్వాత ఇంటర్నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యాన కొసావో శాంతి పరిరక్షక దళంలో పని చేసిన ఆయన.. ఆ తర్వాత యాంటీ నక్సలైట్‌ నిఘా విభాగం (ఎస్‌ఐబీ) డీఐజీగా విధి నిర్వహణ సాగించారు. అనంతరం ఏసీబీ డైరెక్టర్‌గా పని చేసిన ఆయన 2012 నుంచి 2014 వరకు వైజాగ్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. 2014 జూన్‌ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించాక రాష్ట్ర తొలి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ సమయంలోనే గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అనంతరం కొద్ది రోజుల తర్వాత కొన్ని కారణాలతో ప్రభుత్వం ఆయనను అక్కడి నుంచి ఆకస్మికంగా బదిలీ చేసింది. తెలంగాణకు బలమైన మద్దతుదారుడిగా పేరు పొందిన శివధర్‌రెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేయటం ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది.

ఆ తర్వాత రైల్వే, రోడ్డు భద్రత విభాగం ఐజీగా నియమితులయ్యారు. అక్కడి నుంచి డీజీపీ కార్యాలయంలో కోఆర్డినేషన్‌ ఐజీ, అదనపు డీజీగా దాదాపు ఎనిమిదేండ్ల పాటు పని చేసిన ఆయన.. 2023లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా తిరిగి నియమితులయ్యారు. అక్కడే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హోదాకు పదోన్నతి పొందిన శివధర్‌రెడ్డి.. తాజాగా రాష్ట్ర పోలీస్‌ బాస్‌ డీజీపీగా నియమితులయ్యారు. వివిధ హోదాల్లో ఆయన పని చేస్తూ ముఖ్యంగా సీపీఐ(మావోయిస్టు) కార్యకలాపాల అణచివేతలోనూ, అజ్ఞాతంలో ఉన్న అనేక మంది తీవ్రవాదులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావటంలోనూ ప్రత్యేక కృషి సల్పారు. ఐఎస్‌ఐ ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో సైతం శివధర్‌రెడ్డి కీలక పాత్రను నిర్వహించారు.

పలు పతకాలు అందుకున్న శివధర్‌రెడ్డి
విధినిర్వహణలో చేసిన కృషికిగానూ ఆయనకు రాష్ట్రపతి పోలీసు పతకం ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌(పీపీఎం), ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (ఐపీఎం)తో పాటు అంతర్జాతీయ శాంతి పోలీస్‌ పతకం అందాయి. పాస్‌పోర్ట్‌ల వెరిఫికేషన్‌లో దేశంలోనే అగ్రగామిగా నిలిచినందుకు విదేశాంగ శాఖ నుంచి ప్రశంసా పతకం వంటివి కూడా శివధర్‌రెడ్డి అందుకున్నారు. విధి నిర్వహణలో డాంబికాన్ని ప్రదర్శించకుండా సామాన్య ప్రజల సమస్యలను సైతం ఓపికతో విని పరిష్కరించే మనస్తత్వం కలిగిన శివధర్‌రెడ్డి తాను పని చేసిన ప్రతి ప్రాంతంలోనూ అటు ప్రజలు, ఇటు తన సబార్డినేట్‌ల నుంచి మన్ననలను పొందారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్‌ విభాగం, శాంతి భద్రతల విభాగంలో అపారమైన అనుభవాన్ని గడించిన శివధర్‌రెడ్డి పలు సంచలన కేసుల దర్యాప్తులోనూ మంచి ప్రావీణ్యాన్ని చూపించారనే పేరున్నది.

30న ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ
ఈనెల 30న ప్రస్తుత డీజీపీ జితేందర్‌ పదవీ విరమణ చేస్తున్నారు. అక్టోబర్‌ 1న శివధర్‌రెడ్డి డీజీపీ పగ్గాలను స్వీకరిస్తారని తెలిసింది. ఆయనకు మరో ఏడాది కాలం పాటు సర్వీసు ఉన్నది. కాగా ఈయన కంటే సీనియర్‌, 1990 బ్యాచ్‌కు చెందిన నగర పోలీస్‌ కమిషనర్‌ సి.వి ఆనంద్‌కు కాకుండా శివధర్‌రెడ్డికి డీజీపీ పగ్గాలు ప్రభుత్వం అప్పగించటం పోలీసు వర్గాల చర్చనీయాంశమైంది. కాగా అక్టోబర్‌ చివరినాటికి రాష్ట్ర డీజీపీ ఎంపికకు సంబంధించి యూపీఎస్సీ నుంచి తాము పంపించిన సీనియారిటీ అధికారుల జాబితా రాగానే శివధర్‌రెడ్డికి పూర్తి స్థాయి హోదాతో డీజీపీగా ఆదేశాలు వచ్చే అవకాశమున్నదని ప్రభుత్వ వర్గాలను బట్టి తెలుస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -