Thursday, May 29, 2025
Homeజాతీయంఇజ్రాయిల్‌ స్పైవేర్‌ కంపెనీకి షాక్‌ !

ఇజ్రాయిల్‌ స్పైవేర్‌ కంపెనీకి షాక్‌ !

- Advertisement -

ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు
భారీ జరిమానా విధించిన అమెరికా న్యాయస్థానం

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌ స్పైవేర్‌ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ గ్రూపుకు అమెరికా న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. 168 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆ కంపెనీని కాలిఫోర్నియాలోని ఓ కోర్టు ఆదేశించింది. వాట్సప్‌ యజమాని అయిన మెటా దాఖలు చేసిన వ్యాజ్యం ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. ఇది కేవలం ఓ కార్పొరేట్‌ దావాకు లభించిన ముగింపు కాదు. డిజిటల్‌ నిఘా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో ఈ తీర్పును ఓ మైలురాయిగా భావించవచ్చు. ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలకు గూఢచర్యానికి సంబంధించిన శక్తివంతమైన పరికరాలను విక్రయిస్తున్న ఇజ్రాయిల్‌ కంపెనీకి ఈ తీర్పు పెద్ద శరాఘాతమేనని చెప్పవచ్చు.
పెగాసస్‌ స్పైవేర్‌ను అభివృద్ధి చేసింది ఈ ఇజ్రాయిల్‌ కంపెనీయేనన్న విషయం తెలిసిందే. పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థులు, వివిధ దేశాధినేతలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి ప్రభుత్వాలు ఈ స్పైవేర్‌ను వాడుతున్నాయి. ప్రముఖులు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్లే గూఢచారులుగా పనిచేస్తాయి. వాటిలో పెగాసస్‌ స్పైవేర్‌ను రహస్యంగా అమర్చి కూపీ లాగుతారు. తన చర్యలకు ఎన్‌ఎస్‌ఓ గ్రూపే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ గ్రూపుపై విధించిన భారీ జరిమానాతో అలాంటి కంపెనీలకు కనువిప్పు కలిగే అవకాశం ఉంది. తాను కేవలం సార్వభౌమత్వ దేశాలకే స్పైవేర్‌ను విక్రయించానంటూ ఎన్‌ఎస్‌ఓ చేసిన వాదన కోర్టు ముందు తేలిపోయింది. చట్టవిరుద్ధమైన చర్యలను సులభతరం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే వారికి ఈ తీర్పు ఓ చెంపపెట్టు. అంతేకాదు…ఇలాంటి శక్తివంతమైన నిఘా పరికరాల రూపకర్తలు ఇకపై తమ ఉత్పత్తుల కారణంగా జరిగే దుర్వినియోగాల నుండి తేలికగా తప్పించుకోలేకపోవచ్చు.
డిజిటల్‌ హక్కులు, జవాబుదారీతనం కోసం భారత్‌లో జరుగుతున్న పోరాటానికి అమెరికా కోర్టు తీర్పు ఎంతో ఊరట కలిగిస్తుంది. ఎన్‌ఎస్‌ఓ గ్రూపుపై మెటా గత ఆరు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం…ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ మెటా వేదికలకు సుమారు 167.7 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూచేసిన తప్పులకు, భవిష్యత్తులో అలాంటివి పునరావృతం చేయకుండా నిరోధించేందుకు విధించిన 167,254,000 డాలర్ల పరిహారం కూడా ఇందులో చేరి ఉంది. న్యాయ పోరాటంలో మెటా వేదికలకు అయిన ఖర్చులను కూడా పరిహారంలో చేర్చారు. గత సంవత్సరం డిసెంబర్‌ 20న నష్టపరిహారంపై కోర్టులో విచారణ జరిగింది. కంప్యూటర్‌ మోసం-దుర్వినియోగ చట్టాన్ని, కాలిఫోర్నియా సమగ్ర కంప్యూటర్‌ డేటా యాక్సెస్‌ -మోసం చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు ఎన్‌ఎస్‌ఓ గ్రూపును న్యాయమూర్తి హామిల్టన్‌ బాధ్యురాలిని చేశారు.
ఈ కేసు 2019లో ఎన్‌ఎస్‌ఓ గ్రూపు జరిపిన సైబర్‌ దాడి చుట్టూ నడిచింది. వాట్సప్‌ ఆడియో కాలింగ్‌ ఫీచర్‌లోని లోపాన్ని గ్రూపు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1,400 మందికి పైగా వాట్సప్‌ వినియోగదారుల మొబైల్‌ ఫోన్లలో స్పైవేర్‌ను రహస్యంగా అమర్చింది. వీరిలో పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ విమర్శకులు, దౌత్యవేత్తలు వంటి ప్రముఖులు ఉన్నారు. కేసు నుండి బయటపడడానికి ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ దాని ఎత్తులు పారలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -