నవతెలంగాణ-హైదరాబాద్ : తమకు ఇష్టమైన వాహనం కొనుగోలు చేసిన తర్వాత, దానికో ఫ్యాన్సీ నంబర్ కోసం వేలంలో పోటీ పడేవారికి తెలంగాణ రవాణా శాఖ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ప్రాథమిక ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో రవాణా శాఖకు ఏటా రూ. 100 కోట్లకు పైగా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను త్వరలో జారీ చేయనున్నారు.
వాహనదారులు ఫ్యాన్సీ నంబర్‌గా భావించే 9999 నంబర్‌కు ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక ధర రూ. 50 వేలు కాగా, దాన్ని ఏకంగా రూ. 1.50 లక్షలకు పెంచారు. వేలంలో దీనిపై ఎవరు ఎక్కువ పాడితే వారికే ఆ నంబర్ కేటాయిస్తారు. అదేవిధంగా, 6666 నంబర్ ప్రాథమిక ధరను రూ. 30 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఉన్న ఐదు స్లాబులను రవాణా శాఖ ఏడుకు పెంచింది. ప్రస్తుతం రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలుగా ఉన్న ఈ స్లాబులను, ఇకపై రూ. 1.50 లక్షలు, రూ. లక్ష, రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 6 వేలుగా నిర్ణయించారు.