Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఓజీ సినిమాకు షాక్‌

ఓజీ సినిమాకు షాక్‌

- Advertisement -

టిక్కెట్‌ రేట్ల పెంపునకు నిరాకరణ
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
విచారణ అక్టోబర్‌ 9కి వాయిదా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఓజీ సినిమా టిక్కెట్‌ రేట్ల పెంపుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మరోసారి ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వం ఓజీ సినిమా టిక్కెట్‌ రేట్లను ఎందుకు పెంచాలనే నిర్ణయం తీసుకుందో వివరిస్తూ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఇదే తరహాలో సింగిల్‌ జడ్జి ఈ నెల 24న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలును సవాల్‌ చేస్తూ సినిమా నిర్మాత, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించి ఈ నెల 26వ తేదీ వరకు సింగిల్‌ జడ్జి ఆర్డర్‌ అమలును నిలిపివేసింది. ధరల పెంపు మెమోను సవాల్‌ చేసిన పిటిషన్‌ను మరోసారి సింగిల్‌ జడ్జి విచారణ చేయాలని డివిజన్‌ బెంచ్‌ చెప్పింది. దీంతో శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌ కుమార్‌ విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 19న ప్రభుత్వం జారీ చేసిన మెమో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను మరోసారి జారీ చేశారు.

దీంతో పవన్‌ నటించిన సినిమా నిర్మాతకు చుక్కెదురైంది. ఈ నెల 19న ప్రభుత్వం జారీ చేసిన మోమోను సవాలు చేస్తూ బి.మల్లేశ్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సీనియర్‌ న్యాయవాదులు ప్రకాశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వాదించారు. టిక్కెట్ల ధరలను నియంత్రించే జీవో 120కు ప్రభుత్వం మినహాయింపునిస్తూ మెమో ఇవ్వడాన్ని సమర్ధించారు. ఈ అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. నిర్మాత, ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్లు కోట్ల రూపాయలను ఖర్చు చేసిన సినిమా వల్ల ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కూడా లభిస్తోందని తెలిపారు. ప్రభుత్వ జీవో 120 ప్రకారం టికెట్లు వసూలు చేయాలన్న ఆదేశాలకు వ్యతిరేకంగా మెమో జారీ చేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. దీనికి ఉన్న చట్టబద్ధత తేల్చకుండా మెమో మేరకు టిక్కెట్‌ రేట్ల పెంపునకు ఉత్తర్వులు ఇవ్వలేమ న్నారు. మెమో అమలును నిలిపివేస్తూ ఈనెల 24న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతివా దులైన ప్రభుత్వం, నిర్మాత కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిం చారు. విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేశారు.

కేంద్ర రాష్ట్రాలకు నోటీసులు
ఆస్పత్రుల్లో బయోవేస్టేజ్‌ యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలన్న రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఉత్తర్వులను సవాలు చేసిన పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు చేసింది. ఆస్పత్రుల్లోని బెడ్స్‌ ఆధారంగా చార్జీలను నిర్ణయిస్తూ జూన్‌ 4న రాష్ట్ర పీసీబీ ఉత్తర్వులు ఇవ్వడాన్ని డాక్టర్లు, తెలంగాణ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హౌమ్స్‌ అసోసియేషన్‌ హైకోర్టులో సవాల్‌ చేసిన పిటిషన్లను డివిజన్‌ బెంచ్‌ విచారించింది. విచారణను అక్టోబరు 28వ తేదీకి వాయిదా వేసింది.

ప్రార్ధనలకు అనుమతి
హైదరాబాద్‌ బండ్లగూడలోని నూరిషా షరీఫ్‌ దర్గా వద్ద జామియా ఇలహియత్‌ ఇ నూరియా ప్రార్థనలు చేసుకునేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే మరో వర్గానికి అనుమతిచ్చినందున పిటిషనర్లకు మరో సమయంలో అనుమతి ఇవ్వాలని తెలిపింది. అక్టోబరు 2 నుంచి 7వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ప్రార్థనలకు అనుమతి ఇవ్వలేదంటూ జామియా ఇలహియత్‌ ఇ నూరియా వేసిన పిటిషన్‌లో ఈ ఉత్తర్వులను వెలువరించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -