Thursday, October 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌నకు షాక్‌

ట్రంప్‌నకు షాక్‌

- Advertisement -

– బ్రెజిల్‌పై టారిఫ్‌లు రద్దు చేసే బిల్లుకు
– అమెరికా సెనేట్‌ ఆమోదం
– మద్దతిచ్చిన ఐదుగురు రిపబ్లికన్లు
వాషింగ్టన్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు అమెరికా సెనేట్‌లో ఊహించని పరిణామం ఎదురైంది. బ్రెజిల్‌పై ట్రంప్‌ విధించిన టారిఫ్‌లను రద్దు చేసే బిల్లును సెనేట్‌ ఆమోదించింది. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్‌కు చెందిన ఐదుగురు సెనే టర్లు కూడా మద్దతు ఇవ్వడం గమ నార్హం. ట్రంప్‌ ఈ టారిఫ్‌లను ఈ ఏడాది జులైలో విధించాడు. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై కుట్ర కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతిస్పందనగా ట్రంప్‌ ఈ చర్యలకు దిగాడు. బోల్సోనారోపై కేసును అమెరికాకు వ్యతిరేక చర్యగా ట్రంప్‌ భావించాడు. కాగా తాజా బిల్లు సెనేట్‌లో 52-48 ఓట్లతో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ఐదుగురు రిపబ్లికన్‌ సెనేటర్లు మిచ్‌ మెక్‌కానెల్‌, లిసా ముర్కోవ్‌స్కీ, సుసన్‌ కొల్లిన్స్‌, ర్యాండ్‌ పాల్‌, థామ్‌ టిల్లిస్‌లు కూడా మద్దతు ఇవ్వడం విశేషం. అయితే ఈ బిల్లు రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కి వెళ్తుంది. అయితే ఈ బిల్లుకు అక్కడ బ్రేక్‌ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్రెజిల్‌పై ట్రంప్‌ విధించిన ఈటారిఫ్‌లు కొనసాగే అవకాశాలే అధికంగా ఉండొచ్చని పరిశీలకులు చెప్తున్నారు. అయితే ఈ సెనేట్‌ ఓటింగ్‌ ట్రంప్‌ విధానానికి వ్యతిరేకంగా సాగిందనీ, డెమోక్రాట్లతో పాటు ఆయన సొంత పార్టీ సభ్యులు కూడా బిల్లుకు అనుకూలంగా వేయడం దీనికి నిదర్శనమని విశ్లేషకులు చెప్తు న్నారు. ట్రంప్‌ ప్రస్తుతం మలేషియా, జపాన్‌, దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో వాణిజ్య చర్చలు జరపను న్నారు. ఇలాంటి తరుణంలోనే తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

నేపథ్యం
బ్రెజిల్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్‌ ఈ ఏడాది జులైలో 50 శాతం సుంకాలు వేశాడు. అలాగే బ్రెజిల్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కూడా ఆంక్షలు విధించాడు. బ్రెజిల్‌.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోను రాజకీయంగా వేధిస్తోందనీ, అది అమెరికా భద్రత, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని ట్రంప్‌ వాదన. కానీ అమెరికాలోని ట్రంప్‌ రాజకీయ ప్రత్యర్థి వర్గం డెమోక్రాట్లు.. ఆయన చర్యలను తప్పుబడుతున్నారు. నకిలీ అత్యవసర పరిస్థితులు చూపిస్తూ ట్రంప్‌ టారిఫ్‌లు విధిస్తున్నారనీ, ఇలాంటి చర్యలతో అమెరికా ప్రజలకు వస్తువులు మరింత ఖరీదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడైన బోల్సోనారోపై ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించినట్టు, సాయుధ నేరంలో పాల్గొన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయనకు 27 ఏండ్ల శిక్ష కూడా పడింది. తాను ఏ తప్పు కూడా చేయలేదంటూ బోల్సోనారో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు.. ట్రంప్‌ సాయాన్ని కూడా కోరినట్టు వార్తలొచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -